మే 1వ తేదీ నుంచి ఓయూలో సెలువులు

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని హాస్టళ్లకు, మెస్ లకు అధికారులు మే1వ తేదీ నుంచి సెలువులు ప్రకటించారు.

Update: 2024-04-29 13:51 GMT

దిశ,సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని హాస్టళ్లకు, మెస్ లకు అధికారులు మే1వ తేదీ నుంచి సెలువులు ప్రకటించారు. తీవ్ర వేసవి నేపథ్యంలో నీటి, విద్యుత్ ఎద్దడి ఉందని, అందుకే ఈ సెలవులు ప్రకటించినట్లు అధికారులు నోటీసు జారీ చేశారు. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ చరిత్రలో ఏనాడూ నీరు, విద్యుత్ కొరత నేపథ్యంలో సెలవులు ప్రకటించలేదని అంటున్నారు. దీనిపై చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ను వివరణ కోరగా, అన్ని యూనివర్సిటీల్లో సెమిస్టర్ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ఇవ్వడం సాధారణమేనని చెప్పారు.

ఓయూలోనూ ఎన్నో ఏళ్లుగా ఇదే కొనసాగుతోందని పేర్కొన్నారు. అన్ని హాస్టళ్లలో విద్యుత్, ఇతర మరమ్మత్తు పనులు చేయాల్సి ఉంటుందని, ఆ నేపథ్యంలో సెలువులు ఇచ్చామని వివరించారు. నోటీసులో కొన్ని క్లరికల్ తప్పిదాలు జరిగాయని స్పష్టం చేశారు. ఓయూ అధికారుల సర్క్యులర్ పై టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ సూపరింటెండెంటింగ్ ఇంజినీర్, డివిజనల్ ఇంజినీర్లు విద్యుత్ కొరత అనేది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు వారు వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సరిపోయే విద్యుత్ సరఫరా చేస్తున్నామని, వేసవిలోనూ ఎలాంటి విద్యుత్ కొరత లేదని తెలిపారు.

Similar News