సివిల్స్ లో 887 ర్యాంకు సాధించిన హనిత…ఐఏఎస్ కావడమే తన లక్ష్యం

ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 887 ర్యాంక్ సాధించిన అనలాగ్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థిని హనిత అన్నారు.

Update: 2024-04-16 16:23 GMT

దిశ, ముషీరాబాద్: ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 887 ర్యాంక్ సాధించిన అనలాగ్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థిని హనిత అన్నారు. దోమలగూడలోని అనలాగ్ ఐఏఎస్ అకాడమీ లో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్ విన్నకోట శ్రీకాంత్ తో కలిసి ఆమె మాట్లాడారు. వైజాగ్ లో తాను పదవ తరగతి చదివానని, అనంతరం ఇంటర్మీడియట్ ఫ్రిడ్జ్ లో పూర్తి చేశానని చెప్పారు. 2012లో జెఈ రాసి ఖరగ్పూర్ లో ఐఐటీలో చేరానని రెండో సెమిస్టర్ చేస్తున్న సమయంలో తనకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని రెండు కాళ్లు పడిపోయాయన్నారు.

దీంతో ఐఐటీ ని మధ్యలోనే వదిలేసానని నిరాశపడకుండా డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యానని తెలిపారు. తన నాలుగవ ప్రయత్నంలో 887 ర్యాంక్ సాధించడం జరిగిందన్నారు. సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్ ఇచ్చిన ప్రోత్సాహం గైడ్లైన్స్ ర్యాంకు సాధించడానికి ఎంతగానో తోడ్పాటు అందించాలని చెప్పారు. వారి మార్గదర్శకంలో రానున్న రోజుల్లో ఎలాగైనా ఐఏఎస్ సాధిస్తాం అన్న పూర్తి నమ్మకం తనకు ఉందని అన్నారు. సంస్థ డైరెక్టర్ విన్నకోట శ్రీకాంత్ మాట్లాడుతూ యూపీఎస్సీ 2023 ఫలితాల్లో అనలాగ్ ఇన్స్టిట్యూట్ 11, 16, 47, 50 ర్యాంకులు సాధించడంతో పాటు 100 లోపు 100 ర్యాంకులు సొంతం చేస్తుందని తెలిపారు.

తమ సంస్థలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ర్యాంకులు సాధించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో యూపీఎస్సీ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించడమే ధ్యేయంగా తమ సంస్థ ముందుకు సాగుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఇదే లక్ష్యంతో విద్యార్థులకు ప్రత్యేక శైలిలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ర్యాంకు సాధించిన హనితను శాలువాతో సత్కరించి బొకేలు అందజేసి ఘనంగా సన్మానించారు.

Similar News