దిశ, బేగంపేట: ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఘటనను కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. యూపీలో హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల ప్రచార వాతావరణంలో ఇలాంటి ఘటన అనేక అనుమానాలకు దారి తీస్తుందని అన్నారు. ఎన్నికలను పోలరైజ్ చేయడానికి బలమైన ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజలను పోలరైజ్ చేసేందుకు, మతపరమైన ఉద్రిక్తతలను పెంచేందుకు ఈ ఘటన స్పష్టంగా రూపొందించబడినట్లు కనిపిస్తోందన్నారు.
ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులైన నిందితులను వెంటనే గుర్తించాలన్నారు. రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. ''ఓవైసీ భద్రత గురించి నేను వ్యక్తిగతంగా ఆందోళన చెందుతున్నాను. ఆయనకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి.'' అని కోరారు. ఇంకా ''ఓవైసీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత స్థాయిలో కూడా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలి'' అని మర్రి కోరారు.