వసూల్ రాజాలు..! మామూళ్లకు ఎగబడ్డ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది

రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం చుట్టూ వీధి వ్యాపారులు తిష్ట వేశారు.

Update: 2024-05-27 02:35 GMT

దిశ, కూకట్‌పల్లి: రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం చుట్టూ వీధి వ్యాపారులు తిష్ట వేశారు. పాఠశాల సిబ్బందే మామూళ్లు తీసుకుని వారికి ఇచ్చినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కూకట్‌పల్లి గ్రామ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గతేడాది స్థానిక ఎమ్మెల్సీ నవీన్ కుమార్​రూ.కోటి సొంత నిధులతో విశాలమైన తరగతి గదులతో కూడిన రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. అయితే, పాఠశాల ప్రాంగణానికి ఆనుకుని అనారోగ్యాన్ని పంచే చిరుతిండ్ల బండ్లను కొందరు నిర్వహిస్తున్నారు. పాఠశాల సిబ్బంది ఒకరు చాట్​ బండి నిర్వాహకుడు నుంచి నెలకు రూ.3 వేలు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులకు మంచి బుద్ధులతో పాటు మంచి అలవాట్లు నేర్పించాల్సిన పాఠశాల ఉపాధ్యాయులే మామూళ్లకు అలవాటు పడి అనారోగ్యాన్ని పంచే చాట్​బండ్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా పాఠశాలకు ఎదురుగా గల వార్డు కార్యాలయ ప్రహరీకి ఆనుకుని చికెన్ పకోడి బండి ఏర్పాటు చేశారు. పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు నిర్వహించే అధికారులు ఉండే వార్డు కార్యాలయం ముందే రసాయనాలతో కూడిన ఆహారాన్ని వండి పెట్టే చికెన్​ పకోడి బండి ఏర్పాటు చేయడం జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. రూ.కోట్లు పెట్టి నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ఒక వైపు, జీహెచ్​ఎంసీ వార్డు కార్యాలయం మరోవైపు ఈ మధ్యే రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ రోడ్డుకు ఇరువైపులా రోడ్డు ఆక్రమించి వ్యాపారులు బండ్లు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Similar News