మేయర్ పై బీజేపీ కార్పొరేటర్ల ధ్వజం

జీహెచ్ఎంసీ కార్యాలయంలో అసలు ఉద్యోగులకు బదులు మరొకరు(బినామీలు) విధులు నిర్వర్తిస్తున్నారని... BJP Corporators hits out at GHMC Mayor

Update: 2023-02-22 16:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ కార్యాలయంలో అసలు ఉద్యోగులకు బదులు మరొకరు(బినామీలు) విధులు నిర్వర్తిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కుక్కల దాడిలో బాలుడి మృతిపై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మిపై వ్యవహార శైలిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కుక్కలకు ఆకలేసి అలా చేసి ఉంటుందని చెప్పడంపై మండిపడ్డారు. అదీ కాగా సరైన సమయంలో ఫుడ్ పెట్టాలని, కుక్కలను దత్తత తీసుకోవాలని ఉచిత సలహా ఇవ్వడంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే నగరంలో ఎంతోమంది కుక్కలను పెంచుకుంటున్నారని, అలాంటిది ఎవరు దత్తతకు ముందుకు వస్తారని వారు ప్రశ్నించారు.

నగరంలో కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని నిలదీశారు. తమ వీధిలో కుక్కల బెడద ఎక్కువైందని ఎవరైనా ప్రజలు ఫిర్యాదు చేస్తే.. ఒక గల్లీ నుంచి మరో గల్లీలో కుక్కలను వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్క కాటు వేస్తే వైద్యం అందించే నాథుడు కూడా లేడని, ప్రజలకు సరిపడ వైద్య సిబ్బంది లేరని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఖాళీలను భర్తీ కూడా చేయడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదని విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యల తీరు, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై రివ్యూ జరపాలని కోరినా మేయర్ స్పందించలేదని ఆరోపించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులందరూ కమీషన్లకు అలవాటు పడిపోయారని ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ రావు చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. ప్రగతి భవన్ లేదా దారుస్సలాం నుంచి ఆర్డర్ వస్తే కానీ ఏ పని జరగదని బీజేపీ కార్పొరేటర్లు వెల్లడించారు.

Tags:    

Similar News