కోడ్ ముగియగానే కొరడా.. జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు

మహా నగరవాసులకు అత్యవసరమైన, అతి ముఖ్యమైన సేవలందించే జీహెచ్ఎంసీలో నిబంధనలకు విరుద్ధంగా తిష్టవేసిన అధికారులపై వచ్చే నెల 6న ఎలక్షన్ కోడ్ ముగిశాక కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

Update: 2024-05-23 02:49 GMT

దిశ, సిటీ బ్యూరో : మహా నగరవాసులకు అత్యవసరమైన, అతి ముఖ్యమైన సేవలందించే జీహెచ్ఎంసీలో నిబంధనలకు విరుద్ధంగా తిష్టవేసిన అధికారులపై వచ్చే నెల 6న ఎలక్షన్ కోడ్ ముగిశాక కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు పది, పదిహేనేళ్ల నుంచి జీహెచ్ఎంసీలోనే తిష్ట వేసిన రాష్ట్ర వైద్య శాఖకు చెందిన సుమారు 10 మంది వైద్యుల పై అవినీతి ఆరోపణలు, డిప్యూటేషన్ నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ వచ్చే నెల 4న నిర్వహిస్తున్నా, వచ్చే నెల 6వ తేదీ వరకు ఎన్నికల నిబంధనలు వర్తించనున్నందున ఆ తర్వాత కమిషనర్ రోనాల్డ్ రోస్‌ను సైతం ట్రాన్స్ ఫర్ చేసే అవకాశామున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తనను ఇక్కడే కొనసాగించాలని కోరుతూ ట్రిబ్యునల్ లో వేసిన పిటిషన్ కు ప్రతికూలంగా త్వరలోనే నిర్ణయం వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

ఇప్పటికే జీహెచ్ఎంసీలో మూడేళ్ల నుంచి ఐదేళ్ల గరిష్ట డిప్యూటేషన్ గడువు ముగిసిన అధికారులు వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు చెంది, జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లుగా కొనసాగుతున్న వారే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆరుగురిని గత కమిషనర్ లోకేష్ కుమార్ తమ మాతృ శాఖ అయిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సరెండర్ చేసినా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల వద్ద పైరవీలు చేసుకుని మళ్లీ జీహెచ్ఎంసీలోకి వచ్చి వాలినట్లు సమాచారం. వీరిలో ఓ మెడికల్ ఆఫీసర్ నిన్న మొన్నటి వరకు ఖైరతాబాద్ జోన్ లోని ఖైరతాబాద్ సర్కిల్ కు మెడికల్ ఆఫీసర్ గా వ్యవహరించినా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో సర్కారు మారడంతో ఖైరతాబాద్ సర్కిల్ లోనే కొనసాగితే తన బండారం బయట పడుతుందన్న విషయాన్ని గుర్తించి అక్కడి నుంచి శివార్లలోని సర్కిల్ కు మారినట్లు సమాచారం.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు 10వ తేదీన బేగంపేట హరిత ప్లాజా హోటల్ లో సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సమష్టిగా నిర్వహించిన విలేకరుల సమావేశానికి సదరు మెడికల్ ఆఫీసరే భోజనాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోకి వచ్చే బేగంపేట హరిత ప్లాజా హోటల్ లో ఏర్పాట్ల బాధ్యతలను ఖైరతాబాద్ మెడికల్ ఆఫీసర్ కు అప్పగించకుండా, శివారులోని ఓ సర్కిల్ లో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి లిఖిత పూర్వకమైన ఉత్తర్వులు గానీ, ఆదేశాలు గానీ లేకుండా మెడికల్ ఆఫీసర్ గా కొనసాగుతున్న అధికారికి అప్పగించారంటే ఆయనకు ఎంత పలుకుబడి ఉందో అంచనా వేయవచ్చు.

నిబంధనలు తెలిసినా మౌనమెందుకు?

జీహెచ్ఎంసీ గత కమిషనర్ లోకేష్ కుమార్ 10 మంది మెడికల్ ఆఫీసర్లను మాతృ శాఖ అయిన వైద్యారోగ్య శాఖకు సరెండర్ చేసిన, అప్పటి బీఆర్ఎస్ సర్కారులో మున్సిపల్ శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికారికి భారీగా లంచాలు ముట్టజెప్పి పైరవీలు చేసుకుని మళ్లీ జీహెచ్ఎంసీలోకే వచ్చారు. సరెండర్ చేసిన వారిలో ప్రస్తుతం ఆరుగురు జీహెచ్ఎంసీలోనే మెడికల్ ఆఫీసర్లుగా కొనసాగుతున్నారు. వీరు రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు రిపోర్టు చేయని పక్షంలో ఆ విభాగంలోనున్న వీరి పోస్టు రద్దు చేస్తామని మాతృ శాఖ అల్టిమేటం జారీ చేసినా, పట్టించుకోని మెడికల్ ఆఫీసర్లు అడ్డదారుల్లో పైరవీలు చేసుకుని జీహెచ్ఎంసీలోనే కొనసాగుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్దమేనన్న విషయం తెలియక జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఇక్కడే కొనసాగిస్తున్నారా? ఒకవేళ తెలిసినా, ఎందుకు కొనసాగిస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.

Similar News