HYD : శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద చిక్కిన చిరుత

శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది.

Update: 2024-05-03 02:56 GMT

దిశ, శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత పులి సంచారం ఘటన తీవ్ర కలకలం రేపడంతో 5 రోజులుగా విమానాశ్రయంలో అటవీశాఖ అధికారుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అయితే ఎట్టకేలకు గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. అటవీ శాఖ శంషాబాద్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ ఇష్రద్ హైమద్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం పక్కనే ఉన్న గొల్లపల్లి గ్రామం నుండి శంషాబాద్ విమానాశ్రయంలోకి చిరుత పులి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను బట్టి గుర్తించినట్లు తెలిపారు. చిరుత పులిని పట్టుకునేందుకు ఆదివారం ఉదయం 25 సీసీ ట్రాప్ కెమెరాలను, 5 బోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, గత మూడు రోజుల క్రితం సీసీ కెమెరాలలో బోను దగ్గరికి వచ్చి చిరుతపులి వెళ్లినట్లు గుర్తించామని అన్నారు. ఎట్టకేలకు గురువారం రాత్రి బోనులో ఉన్న మేకను పట్టుకునేందుకు చిరుత పులి రావడంతో బోనులో చిక్కినట్లు తెలిపారు. పై అధికారుల ఆదేశాల మేరకు చిరుత పులిని ఫారెస్ట్‌లో విడిచిపట్టే అవకాశం ఉందన్నారు.

 

Similar News