రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులూ హై అలర్ట్..!

రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతుండడంతో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది.

Update: 2024-05-01 02:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతుండడంతో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. మొత్తం 14 జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు గరిష్ట స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు తెలిపింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా జైన, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల చొప్పున నమోదైంది. కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టులో 46 డిగ్రీలు రికార్డయింది. మరో 11 జిల్లాల్లో 45 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతి తక్కువగా హైదరాబాద్‌లో 43.2 డిగ్రీలు నమోదుకాగా మిగిలిన 30 జిల్లాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువే ఉన్నట్లు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ వెల్లడించిన బులెటిన్‌ పేర్కొంది. రానున్న రెండు మూడు రోజుల పాటు ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపింది. గతేడాది ఇదే రోజున గరిష్టంగా 39.7 డిగ్రీలు కౌటాలలో నమోదుకాగా మిగిలిన ఈ 13 జిల్లాల్లో 35-38 డిగ్రీల మధ్యనే నమోదైనట్లు బులెటిన్ తెలిపింది.

గత వారం రోజులుగా తీవ్ర స్థాయిలో నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తున్నాయి. వడదెబ్బకు పలువురు మృతి చెందగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలకు హాజరైన ఓ వృద్ధురాలు వడదెబ్బకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వడగాలుల తీవ్రత దృష్ట్యా ఉదయం 11 నుంచి 4 గంటల వరకు బైట తిరగొద్దంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 37 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నట్లు అనధికారిక సమాచారం.

సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం జగిత్యాల, నల్లగొండ, కరీంనగర్, సిద్ధిపేట, మంచిర్యాల, ములుగు, గద్వాల్, వరంగల్, జనగామ, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యధికంగా నమోదైంది. రానున్న రెండు రోజుల్లో నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, భూపాపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, వనపర్తి, గద్వాల తదితర జిల్లాల్లోనూ 46 డిగ్రీల కంటే ఎక్కువగానే టెంపరేచర్ నమోదవుతుందని సొసైటీ తెలిపింది. రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఆసిఫాబాద్ మొదలు తూర్పున ఉన్న కొత్తగూడెం వరకు, దక్షిణాన నల్లగొండ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు సమాచారం. మే 3 వరకు పొడి వాతావరణం కొనసాగనున్నందున ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో ఉంటాయని హెచ్చరించింది.


Similar News