MLAs purchasing Case: ''సీబీఐకి కుదరకుంటే స్పెషల్ సిట్‌కు అప్పగించండి!''

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టులో మంగళవారం ఈ కేసుకు సంబంధించిన సుదీర్ఘ వాదనలు జరిగాయి.

Update: 2022-12-06 11:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీతో పాటు మరి కొంత మంది పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ఇవాళ సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున దుశ్యంత్ ధవే వాదనలు వినిపించగా బీజేపీ తరపున జెఠ్మలాని వాదనలు వినిపించారు. కేసుతో సంబంధం లేని వారిని ఎఫ్ఐఆర్ లో చేర్చారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది దవే.. డివిజన్ బెంచ్ ఆదేశాలు క్లియర్ గా ఉన్నాయని అందువల్ల సీబీఐ విచారణ కోరడం సమంజసం కాదన్నారు. ఇవాళ ఉదయం నుంచి వాదనలు జరిగాయి.

సిట్ తరపున వాదనలు వినిపిస్తూ.. బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధికోసమే రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందని, దాదాపు వంద కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనాలనుకుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలను అస్థిర పరిచే ప్రయత్నాలు చేశాయని అదే స్థాయిలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యవహరించే ప్రయత్నాలు జరిగాయని, సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరే అర్హత నిందితులకు లేదని సిట్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుల తరపు న్యాయవాది వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుని చట్టవిరుద్ధంగా అరెస్టు చేయాలని చూస్తోందని, నిబంధనలకు విరుద్ధంగానే నోటీసులు ఉన్నాయని, ఈ కేసులో దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలన్నారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించలేని పక్షంలో స్పెషల్ సిట్ కు అప్పగించాలనే మరొక వాదన కోర్టు ముందు పిటిషనర్ తరపు న్యాయవాది ఉంచారు.

Similar News