ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. డ్రైవర్‌పై మహిళల బూతు పురాణం (వీడియో)

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే.

Update: 2024-05-25 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. కాగా, ఫ్రీ బస్సు కారణంగా బస్సుల్లో తరచూ ఏదో చోట గొడవలు జరగడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై మహిళలు అనుచితంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్కెట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇది మా ఫ్రీ బస్సు.. మా ఇష్టం వచ్చినంత సేపు ఆగాల్సిందే లేదంటే మా వాళ్లతో కొట్టించి సస్పెండ్ చేయిస్తామని మహిళలు డ్రైవర్‌కు వార్నింగ్ ఇచ్చారు.

అప్పటికే 5 నిమిషాలు ఆపగా.. తోటి ప్రయాణికులు గొడవ చేయడంతో బస్సును డ్రైవర్ ముందుకు కదిలించాడు. దీంతో ఆ మహిళలు డ్రైవర్‌ను బూతులు తిడుతూ సూర్యాపేట వెళ్లిన తర్వాత మా వాళ్లకు చెప్పి కొట్టిస్తామని హెచ్చరించారు. డ్యూటీ ఎలా చేస్తావో అంటూ బెదిరించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తమపై దౌర్జన్యం చేశారని డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళా ప్రయాణికులు తాము పోలీసు స్టేషన్‌కు రామని చెప్పి భీష్మించుకుని కూర్చున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Similar News