నోటా ఇష్యూ.. ఈసీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కీలక విజ్ఞప్తి

నోటాను కల్పిత అభ్యర్థిగా గుర్తించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థ సారధికి విజ్ఞప్తి చేసింది.

Update: 2024-05-25 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నోటాను కల్పిత అభ్యర్థిగా గుర్తించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థ సారధికి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఎఫ్ఎఫ్జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా ప్రకటించాయని, దానితో నోటా బరిలో ఉంటుందని తప్పక ఎన్నిక జరగాలని కోరారు. ఎన్నికలలో ఏ అభ్యర్థి నచ్చనప్పుడు నోటాకు ఓటు వేస్తున్నారని అయితే నోటాకు ఓటు వేయడమంటే బరిలో ఉన్న ఏ పార్టీ అభ్యర్థి కూడ నచ్చలేదనే అర్థమన్నారు. నోటాకు ఎన్ని ఓట్లు వచ్చినా పెద్దగా జరిగేది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.

ఇటీవలే జరిగిన పార్లమెంటు ఎన్నికలో గుజరాత్ రాష్ట్రంలో ఒక అభ్యర్థికి లాభపడేటట్లు బరిలో ఉన్న మిగిలిన అభ్యర్థులు అందరూ తమ నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో దానితో బరిలో ఉన్న ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లో జరిగిందని, ఈ విషయంలో నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా గుర్తించి ఏకగ్రీవ ఎన్నికను ఆపాలని సుప్రీమ్ కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో కొన్ని గ్రామాలలో సర్పంచ్ ఎన్నిక వేలం వేసి, అధికంగా చెల్లించిన వ్యక్తికి పోటీ ఎవరూ చేయకుండా ఏకగ్రీవ ఎన్నిక జరిపారని తెలిపారు. ఇది ఒక దుష్ట సంప్రదాయమని, దీనితో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేక పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొందరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ గుర్తిస్తూ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ను విజ్ఞప్తి చేశామని తెలిపారు. నోటా పై చర్చించేందుకు ఈ నెల 28వ తేదీన ప్రెస్ క్లబ్‌లో నిష్ణాతులతో ఒక చర్చా వేదిక నిర్వహిస్తున్నామని పద్మనాభరెడ్డి తెలిపారు.

Similar News