జూన్ 4 తర్వాత దేశంలో పెను మార్పులు: మాజీ MP బూర ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రాహూల్ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని, ఈ అంశంపై

Update: 2024-05-24 16:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రాహూల్ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని, ఈ అంశంపై మహమ్మద్ గజినీ చేయలేని దారుణమైన దండయాత్రలు దేశ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తోందని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం వర్గాలను ఓబీసీ కోటాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కలకత్తాలో బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఓబీసీలో చేర్చడం దుర్మార్గమైన చర్య అని విమర్శలు చేశారు. హిందూ వ్యతిరేక కుట్రలో భాగంగానే ముస్లిం రిజర్వేషన్లు మమత ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

ఓబీసీ కోటాలో ఉన్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తూ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ తీర్పు రాహుల్ టీమ్‌కు చెంప పెట్టులాంటిదన్నారు. బెంగాల్‌లో ఉద్యోగాల కోసం హిందువులు మత మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొనారు. హైకోర్టు తీర్పును మమత ధిక్కరిస్తోందని, ఆమెను ముఖ్యమంత్రి హోదాకు అనర్హురాలిగా ప్రకటించాలని బూర డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న హిందువులందరూ మమతపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. జూన్ 4 తరువాత బెంగాల్‌లోనే కాదని, దేశంలోనే పెను మార్పులు సంభవిస్తాయని నర్సయ్య గౌడ్ అన్నారు. అధికారంలోకి రాకముందు ఓబీసీల కులగణన చేసి ఓబీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఓబీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కుల గణన చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మిలియన్ మార్చ్ తరహాలో పోరాటానికి సిద్ధమవుతామని బూర నర్సయ్య గౌడ్ స్పష్టంచేశారు.

Similar News