బలిదేవతను ఎందుకు పిలుస్తున్నావ్.. రేవంత్ రెడ్డికి గ్యాదరి కిషోర్ కౌంటర్

రేవంత్ రెడ్డి దొంగల ముఠా నాయకుడు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ అన్నారు.

Update: 2024-05-25 06:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి దొంగల ముఠా నాయకుడు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి 420 హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టారని ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను తిట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారే తప్ప ఈ ఐదు నెలల్లో రేవంత్ చేసిందేమి లేదన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ అని.. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులుగా దొంగలనే ఖరారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టభద్రులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సీఎంగా పదవి భాద్యతలు చేపట్టగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాల నియామకాలు పూర్తి చేయడం తప్ప రేవంత్ చేసిందేమి లేదన్నారు. ఇచ్చిన ఉద్యోగాలకు ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదని.. కేసీఆర్ హయాంలో లక్షా 48 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో 50 వేల ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉందన్నారు.2004 -2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 20 వేల ఉద్యోగాలు మాత్రమే అని గుర్తు చేశారు. నిరుద్యోగంపై దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ రెచ్చగొట్టిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా నిరుద్యోగులు వాస్తవాలు గ్రహించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అందర్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్ మోసాలకు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. రేవంత్ తన అబద్ధాలను రాహుల్ ప్రియాంకలకు అంటించారన్నారు. రాహుల్, ప్రియాంకలు తెలంగాణలో అన్నీ జరిగిపోతున్నాయంటూ వేరే రాష్ట్రాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. రేవంత్ దొంగ మాటలకు ఓట్లతో పట్టభద్రులు బుద్ది చెప్పాలని తెలిపారు. తన లాంటి ఉద్యమకారులకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ కాదని చెప్పారు. మా అభ్యర్థి రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో చదువుకున్న విద్యావంతుడని.. ఓయూ, కేయూ విద్యార్థులకు రాజకీయ అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.

తీన్మార్ మల్లన్న ఎక్కడ చదువుకున్నాడో తెలియదని.. ఆయనకు బ్లాక్ మెయిలింగ్ తప్ప ఏదీ రాదన్నారు. శాసన మండలి కి మల్లన్న పోతే ఆయన బ్లాక్ మెయిలింగ్‌ను ఆమోదించినట్టు అవుతుందన్నారు. ప్రశ్నించే వారిని ఇష్ట మొచ్చినట్టు తిట్టడమే తీన్మార్ మల్లన్న పని అన్నారు. సీఎం రేవంత్ తనపై విమర్శలను జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. సోషల్ మీడియా లో పోస్టులు పెడితే సీఎం ప్రోద్భలంతో కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. విద్యావంతుడు రాకేష్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. సోనియాను రేవంత్ బలి దేవత అన్నారని.. మరి బలి దేవతను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఎందుకు పిలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  

Similar News