వేధిస్తే కోర్టుకు లాగుతాం.. ఫేక్ లోగో వివాదం.. డీజీపీ, సజ్జనార్‌పై కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోగో విషయంలో రాజకీయ వివాదం పెరుగుతోంది. ఆర్టీసీ ఫేక్ లోగోను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారనే కారణంతో తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్, హరీశ్ రెడ్డిలపై ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయగా చిక్కడపల్లి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Update: 2024-05-24 06:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోగో విషయంలో రాజకీయ వివాదం పెరుగుతోంది. ఆర్టీసీ ఫేక్ లోగోను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారనే కారణంతో తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్, హరీశ్ రెడ్డిలపై ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయగా చిక్కడపల్లి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. లోగో విషయంలో అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్, కొన్ని మీడియా సంస్థలు ముందుగానే ఆర్టీసీ లోగోపై ప్రచారం చేస్తే వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. కేవలం ఓ పక్షానికి సానుకూలంగా ఉండి మరో పక్షానికి చెందిన వారిపై మాత్రమే కేసులు పెట్టడం వెనుక మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటో రాష్ట్ర డీజీపీ, ఆర్టీసీ ఎండీ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు రాజకీయ పెద్దల ఆధ్వర్యంలో ఈ తరహా వేధింపులు కొనసాగించాలని భావిస్తే మేము మిమ్మల్ని కోర్టుకు లాగాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కాగా నాయిని అనురాగ్ రెడ్డి అనే ట్విట్టర్ యూజర్ ఈ ఆర్టీసీ లోగో వివాదం పై ప్రశ్నలు కురిపించగా కేటీఆర్ ఈ ట్వీట్ పై స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఇంతకు అనురాగ్ రెడ్డి ఏమన్నారంటే.. లోగో మార్పుకు సంబంధించిన ఫోటోను తొలుత మే 22 తేదీ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అనుబంధ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతర్గత మీడియా సహా పలు మీడియా సంస్థలు దీన్ని పోస్ట్ చేశాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాత్రం ఈనెల 23వ తేదీని దీనిపై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు.

నకిలీ లోగోను ఖండించడానికి 24 గంటల సమయం ఎందుకు పట్టింది? ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే సజ్జనార్ ఎందుకు అన్ని మీడియా సంస్థలు ఈ లోగోను ట్వీట్ చేసే వరకు వేచి ఉన్నారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కేసులు వేయాలనుకుంటే ఈ ఫేక్ సమాచారానికి మూలం ఎక్కడ ఉందో దానిపై కేసు వేయాలి కానీ బీఆర్ఎస్ పార్టీలోని ఎంపిక చేసిన వ్యక్తులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు దాఖలైన కేసు సమాచారాన్ని ముందుగా సీఎంకు పీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు ట్వీట్ చేశాడని అసలు సీఎం నుంచి పీఆర్‌ఓల కుమారులకు ఇలాంటి సమాచారం ఎప్పటి నుంచి అందుతోంది? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News