బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అసలు సూత్రధారి ఆమె.. సంచలన విషయాలు బయటపెట్టిన ఈడీ!

ఢిల్లీ మద్యం కుంభకోణం ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మధ్య పొలిటికల్ అవగాహనతోనే జరిగిందని ఈడీ వెల్లడించింది.

Update: 2023-03-11 02:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మధ్య పొలిటికల్ అవగాహనతోనే జరిగిందని ఈడీ వెల్లడించింది. సౌత్ గ్రూపులో ఒకరుగా ఉన్న కవిత తన ప్రతినిధులుగా అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్, ఆడిటర్ బుచ్చిబాబు, బోయిన్‌పల్లి అభిషేక్ ద్వారా ఆప్ ప్రతినిధులతో చర్చలు జరిపారని వివరించింది.

లిక్కర్ వ్యాపారంలో లబ్ధి (లాభాలు) కలిగేలా పాలసీని రూపొందిస్తే దానికి బదులుగా కిక్‌బ్యాక్ రూపంలో ముడుపులు ముట్టచెప్పాలన్నది సౌత్ గ్రూపు, ఆప్ నేతల మధ్య కుదిరిన ఒప్పందమని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో జరిగిన చర్చల్లో రూ.31 కోట్లను తరలించడంపై చర్చలు జరిగాయని, ఇద్దరు హవాలా ఏజెంట్ల ద్వారా ఢిల్లీలోని బెంగాల్ మార్కెట్‌కు ఆ డబ్బులు చేరుకున్నాయని పేర్కొన్నది. మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరుతూ స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన 58 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను వెల్లడించింది.

లిక్కర్ పాలసీలో కుదిరిన ఒప్పందం ప్రకారం మద్యం తయారీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ వ్యాపారులకు ప్రయోజనం కలిగేలా ఆప్ నేతలు సహకరించారని, దానికి అనుగుణంగా వచ్చే లాభాల్లో 6% మేర వారికి కిక్‌బ్యాక్ రూపంలో ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని పేర్కొన్నది. ఈ ప్రకారం ఎల్-1 లైసెన్సు దక్కించుకున్న ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవితకు 33%, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (ఆయన కుమారుడు రాఘవ)కి 33%, సమీర్ మహేంద్రు (కంపెనీ ఎండీ)కు 33% చొప్పున వాటాలు ఉండేలా అవగాహన ఏర్పడిందని తెలిపింది. సౌత్ గ్రూపు తరఫున మొత్తం రూ.100 కోట్లు హవాలా మార్గంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరినట్టు పలువురి స్టేట్‌మెంట్లను క్రోడీకరించిన ఈడీ.. ఈ విషయాలను ఆ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.

ధ్రువీకరించిన ఆడిటర్ బుచ్చిబాబు

మనీశ్ సిసోడియా తరపున ఆప్ పార్టీ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్‌చార్జి విజయ్ నాయర్ ప్రతినిధిగా వ్యవహరిస్తుండగా కవిత తరపున పిళ్లయ్ వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించినట్టు గతేడాది మార్చి 6న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని వివరాలను ఈడీ ఉదహరించింది. డీల్‌లో భాగంగా ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత తరఫున పిళ్లయ్ ప్రతినిధిగా ఉన్నట్టు తెలిపింది.

ఇదే విషయాన్ని కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా గతంలో పనిచేసిన బుచ్చిబాబు సైతం గత నెల (ఫిబ్రవరి) 23న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ధ్రువీకరించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సిసోడియాతో కవితకు పొలిటికల్ అండర్‌స్టాండింగ్ ఉన్న విషయాన్ని కూడా నొక్కిచెప్పారు. ఆప్ నేతల (కేజ్రీవాల్, సిసోడియా)కు విజయ్ నాయర్ ప్రతినిధిగా ఉన్నందున ఆయనతో కవిత 2021 మార్చి 19, 20 తేదీల్లో సమావేశమై లిక్కర్ పాలసీ, పరస్పర ప్రయోజనాల గురించి చర్చించినట్టు బుచ్చిబాబు స్పష్టం చేశారు.

ఢిల్లీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎంల తరఫున తానే ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనపై ఫుల్ టైమ్ వర్క్ చేస్తున్నట్టు ఆ మీటింగులో కవితకు విజయ్ నాయర్ అర్థం చేయించినట్టు బుచ్చిబాబు తెలిపారు. లిక్కర్ వ్యాపారంలో లాభాలు కలిగేలా పాలసీని రూపొందిస్తే దానికి ప్రతిఫలంగా ఆప్ నేతలకు ఫండ్స్ ఇస్తామని కవిత ఆ సమావేశంలో అవగాహన కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు.

ఢిల్లీలోని గౌరీ అపార్టుమెంట్‌లో మీటింగ్ జరిగిన తర్వాత దానికి కొనసాగింపుగా హైదరాబాద్‌లోని కోహినూర్ హోటల్‌లో 2021 జూన్‌లో మరో మీటింగ్ జరిగిందని తెలిపారు. కోహినూర్ మీటింగుకు విజయ్ నాయర్‌తో పాటు దినేశ్ అరోరా కూడా వచ్చారని, కవిత తరఫున తనతో పాటు అరుణ్ పిళ్లయ్, అభిషేక్ కూడా హాజరయ్యారని బుచ్చిబాబు తెలిపారు.

హవాలా ద్వారా..

ఢిల్లీ లిక్కర్ మార్కెట్‌కు సంబంధించిన అంశాలను కోహినూర్ హోటల్‌లో చర్చించుకున్న తర్వాత రూ.30 కోట్లను ఇక్కడి నుంచి ఢిల్లీకి చేర్చడంపై దినేష్‌కు విజయ్ నాయర్ కొన్ని సూచనలు చేశారని బుచ్చిబాబు వివరించారు. ఆ ప్రకారం బోయిన్‌పల్లి అభిషేక్‌తో సమన్వయం చేసుకుని వీలైనంత తొందరగా చేరవేయడంపై సూచనలు చేసినట్టు తెలిపారు.

చివరకు రాజేశ్, సుధీర్ అనే ఇద్దరు హవాలా ఏజెంట్ల ద్వారా తొలుత రూ.కోటి ఢిల్లీలోని బెంగాల్ మార్కెట్‌లో (2021 సెప్టెంబరులో) విజయ్ నాయర్‌కు దినేశ్ అప్పగించారు. ఆ తర్వాత మరో రూ.30 కోట్లను కూడా అదే తరహాలో విజయ్‌కు అందజేశారు. ఇవన్నీ సౌత్ గ్రూపు ద్వారా కిక్‌బ్యాక్ ఒప్పందంలో భాగంగా చేరినవేనని బుచ్చిబాబు ఆ స్టేట్‌మెంట్ (ఫిబ్రవరి 23, 2023)లో పేర్కొన్నారు.

కోడ్ భాషలో ‘మేడమ్’ అంటే కవిత

విజయ్ నాయర్ నుంచి వాట్సాప్ మెసేజ్ ద్వారా కోడ్ భాషలో సౌత్ గ్రూపు ప్రతినిధులతో చాటింగ్ జరిగింది. ‘వీ నీడ్ మనీ.. 33 ఫర్ సమీ.. 33 ఫర్ యూ.. 33 ఫర్ మేడమ్’ అనే కోడ్ భాషలో ఈ చాటింగ్ జరిగింది. ఈ కోడ్ భాష గురించి ఈడీ అధికారులు బుచ్చిబాబును, విజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. బుచ్చిబాబు గత నెల 23న ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం ‘వీ’ అంటే విజయ్ నాయర్ అని. ‘యూ’ అంటే మాగుంట రాఘవ అని, ‘మేడమ్’ అంటే కవిత అని వివరించారు. ఈ చాటింగ్ మొత్తం 2021 ఆగస్టు 24న జరిగింది. వీటి స్క్రీన్ షాట్‌లను ఈడీ సేకరించింది. మాగుంట రాఘవకు తన వాటా (33%) విషయంలో అసంతృప్తి ఉండడంతో తండ్రితో మాట్లాడాతానని, 75% కంటే తక్కువ ఉంటే ఒప్పుకోరనే అభిప్రాయాన్ని రాఘవ వెల్లడించారు.

చివరకు కవిత కుదుర్చుకున్న డీల్ ప్రకారం పెర్నాడ్ రికార్డ్ అనే మద్యం తయారీ సంస్థకు ఇండో స్పిరిట్స్ హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటే అందులో పెట్టుబడులు పెట్టడానికి సమ్మతమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఆ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రుతో వ్యాపార భాగస్వామ్యంపై కవిత అవగాహనకు వచ్చినట్టు ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ముసాయిదా కాపీ ఆ రాష్ట్ర మంత్రివర్గానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమర్పించడానికి రెండు రోజుల ముందే బుచ్చిబాబుకు చేరింది. ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లో ఈ డాక్యుమెంటు లభించినట్టు ఈడీ పేర్కొన్నది. సిసోడియా సమ్మతితో విజయ్ నాయర్ నుంచి ‘సిగ్నల్ యాప్’ ద్వారా ముసాయిదా కాపీ అందినట్టు బుచ్చిబాబు తెలిపారు.

సౌత్ గ్రూపుతో ‘ఆప్’కు లింకులు

సౌత్ గ్రూపులో కవిత కీ రోల్ పోషించారని, మొత్తం గ్రూపు తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర అడ్వాన్సు కిక్‌బ్యాక్ ముట్టిందని ఆమె ప్రతినిధిగా ఉన్న పిళ్లయ్ గతేడాది నవంబరు 11న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఇండో స్పిరిట్స్ కంపెనీకి ఎల్-1 లైసెన్సు ఇవ్వడంతో పాటు గ్రూపు మొత్తానికి 65% వాటా ఇచ్చేలా కుదిరిన ఒప్పందంలో భాగంగా రూ.100 కోట్ల డీల్ ఫైనల్ అయినట్టు గత నెల 16న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పిళ్లయ్ ధ్రువీకరించారు. కవిత తరఫున ఆమ్ ఆద్మీ పార్టీతో సంప్రదింపులకు పిళ్లయ్, నిధులు సమకూర్చడానికి బోయిన్‌పల్లి అభిషేక్, ఆర్థిక వ్యవహారాలు చూడడానికి బుచ్చిబాబు ప్రతినిధులుగా ఉన్నట్టు ఈడీ పేర్కొన్నది. అడ్వాన్స్ కిక్‌బ్యాక్ రూపంలో ఇచ్చే రూ.100 కోట్లను మూడు హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సమకూర్చుకోవాలన్నది సౌత్ గ్రూపు ఉద్దేశమని పేర్కొన్నది.

ఎంపీ సంజయ్ సింగ్ ద్వారా ‘ఆప్’కు ఫండ్స్

పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండ్స్ సేకరణ సమస్యగా మారడంతో సంజయ్ సింగ్ (ప్రస్తుతం ఎంపీ) రంగంలోకి దిగారు. దినేశ్ అరోరా ద్వారా ఇందుకోసం ప్రయత్నాలు చేశారు. సౌత్ గ్రూపుతో ఇప్పటికే విజయ్ సాయంతో రాయబారం నడుపుతున్న దినేశ్ అరోరా.. అదే సమయంలో ఆ పార్టీకి నిధులు సమకూర్చే బాధ్యతను కూడా తీసుకున్నారు.

ఆప్‌కు ప్రస్తుతం ఫండ్స్ అవసరం ఉన్నట్టు సంజయ్ సింగ్ అడగడంతోనే రూ.82 లక్షలను దినేశ్ సమకూర్చారు. వీటిని సిసోడియాకు, పార్టీ ట్రెజరర్ రాజేందర్ గుప్తాకు అందించినట్టు దినేష్ అరోరా గతేడాది అక్టోబరు 1న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. పార్టీకి ఫండ్స్ కోసం 2019-21 మధ్యకాలంలో నేషనల్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఢిల్లీ సెక్రటేరియట్‌లో, సిసోడియా నివాసంలో సుమారు పది మీటింగులు జరిగినట్టు ఈడీ వివరాలను సేకరించింది.

ఫోన్ల ధ్వంసం, ఎవిడెన్సులు మాయం

లిక్కర్ స్కామ్‌లో సిసోడియా నాలుగు వేర్వేరు నంబర్లతో మొత్తం 14 ఫోన్లను వాడారని, ఇందులోని డిజిటల్ ఎవిడెన్సులను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. వీటికి సంబంధించి తీహార్ జైల్లో విచారణ సందర్భంగా ప్రశ్నించినా.. పూర్తి వివరాలు ఇవ్వడానికి సిసోడియా సహకరించలేదని, కస్టడీలోకి తీసుకుని రాబట్టాలనుకుంటున్నట్టు స్పెషల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొన్నది.

మనీ లాండరింగ్‌కు పాల్పడడం, హవాలా మార్గంలో ఆర్థిక లావాదేవీలు జరగడం, ఉద్దేశపూర్వకంగానే పాలసీ రూపకల్పన సమయంలో నేరపూరిత కుట్రకు పాల్పడడం లాంటివి చోటుచేసుకున్నందున ఆయనను కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. సిసోడియా వాడిన ఫోన్లుగానీ, అందులోని సిమ్‌లుగానీ ఆయన పేరుతో రిజిస్టర్ కాలేదని, బినామీ పేర్లతో ఉన్నాయని ఈడీ ఆరోపించింది. తీహార్ జైల్లో రెండు రోజుల పాటు ప్రశ్నించినా వాస్తవాలను వెల్లడించలేదని, సౌత్ గ్రూపు నుంచి కిక్ బ్యాక్ రూపంలో తీసుకున్న డబ్బుల వివరాలను బహిర్గతపర్చలేదని, దినేశ్ అరోరాతో ఉన్న సంబంధాల గురించిగానీ, విజయ్ నాయర్‌తో ఉన్న సాన్నిహిత్యం గురించిగానీ ఆయన స్పష్టత ఇవ్వలేదని ఈడీ పేర్కొన్నది.

మొత్తంగా లిక్కర్ పాలసీతో సిసోడియాకు రూ.292.8 కోట్లు చేరాయని, ఇందులో రూ.192.8 కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీ లాభాల్లో 6% వాటాగా ముట్టినవని, మిగిలిన రూ.100 కోట్లు సౌత్ గ్రూపు నుంచి అడ్వాన్స్ కిక్‌బ్యాక్ రూపంలో వచ్చినవని ఈడీ వివరించింది. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం వివరాలను సిసోడియా నుంచి రాబట్టలేకపోయినందున దర్యాప్తునకు ఆటంకం కలుగుతున్నదని, సెక్షన్ 19 ప్రకారం అరెస్టు చేయాల్సి వచ్చిందని ఈడీ పేర్కొన్నది.

కవితపైనా సెక్షన్ 19 ప్రయోగం?

కవితను సైతం విచారించడానికి మార్చి 11న ముహూర్తం ఖరారు చేయడంతో ఆమెను కూడా సౌత్ గ్రూపు వ్యవహారానికి సంబంధించి ఈడీ ప్రశ్నించనున్నది. రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌ ముడుపులతో పాటు పది ఫోన్లను వాడాల్సిన అవసరం, డిజిటల్ ఎవిడెన్సులను ధ్వంసం చేయడం, హైదరాబాద్ కోహినూర్ హోటల్‌లో ముగ్గురు ప్రతినిధులు (పిళ్లయ్, అభిషేక్, బుచ్చిబాబు) ద్వారా లిక్కర్ పాలసీపై చర్చలు జరగడం.. తదితరాలపై ఈడీ వివరాలను రాబట్టే అవకాశం ఉన్నది.

లిక్కర్ పాలసీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే వ్యాఖ్యానించిన కవిత ఈడీ ఎంక్వయిరీలో సైతం అదే విషయాన్ని చెప్పనున్నట్టు జంతర్ మంతర్ దగ్గర మీడియాకు వివరించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన విషయాలపై సమాధానం చెప్తానని, ఆ తర్వాత వారు ఏం చేసుకుంటారో చేసుకోనీ.. అంటూ బదులిచ్చారు. అంతకుమించి తాను చేయగలిగిందేమీ లేదని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19ను సిసోడియా మీద ప్రయోగించినట్లుగా కవిత మీద కూడా ప్రయోగించి అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

లిక్కర్ స్కాంతో నాకు సంబంధం లేదు. ఈడీ ఎంక్వయిరీలో కూడా ఇదే చెబుతాను. వారు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానం ఇస్తాను. అంతకు మించి నేను చేయగలిగింది ఏమీ లేదు. వారు ఏం చేసుకుంటారో చేసుకోనీ..

- ఢిల్లీలో మీడియా సమావేశంలో కవిత (మార్చి 9న) 

Tags:    

Similar News