ఎర్లీబర్డ్ కలెక్షన్ రూ.827 కోట్లు.. టార్గెట్‌ను మించి ఎంత వసూలు అయిందంటే..?

జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ ఎర్లీబర్డ్ స్కీం కింద రికార్డు స్థాయిలో కలెక్షన్ వచ్చింది.

Update: 2024-05-03 02:05 GMT

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ ఎర్లీబర్డ్ స్కీం కింద రికార్డు స్థాయిలో కలెక్షన్ వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు ముందస్తుగా పన్ను చెల్లించే వారికి అయిదు శాతం రాయితీనిస్తూ అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీం టార్గెట్‌కు తగినట్టుగా ట్యాక్స్ వసూలైంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్‌లో కూడా అమలు చేసిన ఎర్లీబర్డ్ టార్గెట్ రూ.800 కోట్లుగా నిర్ణయించగా, రూ.766 కోట్ల వరకు వసూలు కాగా, ఈసారి ఎర్లీబర్డ్ టార్గెట్‌గా రూ.800 కోట్లుగా నిర్ణయించారు. కానీ ఏప్రిల్ చివరి రోజు చివరి నిమిషం వరకు జరిగిన ఆన్‌లైన్ చెల్లింపుల ప్రకారం జీహెచ్ఎంసీకి ఎర్లీబర్క్ స్కీం అమలుతో కేవలం నెల రోజుల్లోనే రూ.827 కోట్ల వరకు ట్యాక్స్ వసూలైంది. నిర్ణీత లక్ష్యం కన్నా అదనంగా రూ.27 కోట్ల కలెక్షన్ సమకూరింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా పన్ను వసూళ్లతో టార్గెట్‌ను మించి ట్యాక్స్ వసూలు కావటంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న జీహెచ్ఎంసీ కొంత వరకు ఊరట కల్గిందనే చెప్పవచ్చు.

మళ్లీ జూన్ రెండో వారం నుంచి...

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమైన జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలతో పాటు ట్యాక్స్ విభాగానికి కూడా ఎలక్షన్ డ్యూటీలు పడ్డాయి. ఒక వైపు ఎలక్షన్ విధులు వాటికి సమాంతరంగా ట్యాక్స్ కలెక్షన్ విధులు కూడా నిర్వర్తించాల్సిందేనంటూ అధికారులు హుకూం జారీ చేయటంతో ట్యాక్స్ సిబ్బందికి ఉరుకులు, పరుగులు తప్పలేదు. కానీ ఏప్రిల్ 30తో ఎర్లీబర్డ్ స్కీంకు తెరపడటంతో ట్యాక్స్ సిబ్బందికి కొంత మేరకు పనిభారం తగ్గిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం కేవలం ఎలక్షన్ డ్యూటీలకే జీహెచ్ఎంసీలోని దాదాపు అన్ని విభాగాల పరిమితమయ్యాయి. ఈ నెల 13న పోలింగ్, ఆ తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు వంటి ముఖ్యమైన ఘట్టాలు ముగిసిన తర్వాత తిరిగి జూన్ రెండో వారం నుంచి మళ్లీ ట్యాక్స్ కలెక్షన్ పై పూర్తి స్థాయిలో దృష్టిసారించే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24)కు గాను రూ.2 వేల కోట్ల టార్గెట్ పెట్టగా, రూ.1917 కోట్ల పన్ను వసూలైంది. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించి ఎర్లీబర్డీ స్కీం ద్వారా రికార్డు స్థాయిలో ట్యాక్స్ వసూలు చేసుకున్నందున రూ.2 వేల కోట్ల టార్గెట్ విధించే అవకాశాలున్నట్లు సమాచారం.

Similar News