గాడిద గుడ్డు.. బీజేపీపై కాంగ్రెస్ వినూత్న ప్రచారం

బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని కాంగ్రెస్ ప్రశ్నించింది.

Update: 2024-04-29 14:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. పదేళ్ల పాటు రాష్ట్రానికి పంగనామం పెట్టిందని మండిపడుతున్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ వినూత్నంగా 'గాడిద గుడ్డు' పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వైఫ్యల్యాలపై ఇలాంటి హోర్డింగ్‌లు ఏర్పాటు చేసేందుకు పార్టీ రెడీ అయింది. ‘తెలంగాణ అడిగినవి ఇవి! బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు ’ పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి, అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి, బెల్లయ్య నాయక్‌లు ప్రారంభించారు. తెలంగాణ రూపాయి పంపిస్తే, బిచ్చం ఇచ్చినట్లు 43 పైసల రిటర్న్ ఇస్తున్నారన్నారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా అందడం లేదని కాంగ్రెస్ బ్యానర్లలో పొందుపరిచింది. కనీసం ఒక్క ఐఐఎమ్, ఎన్‌ఐడీ విద్యాలయం ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. 811 టీఎంసీ కృష్ణ జలాలలో సరైన వాటా ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఐఐటీ, మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదని ప్రచార కార్డుల్లో పెట్టారు. ‘‘బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్” అంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ కాంగ్రెస్ బీజేపీపై విరుచుపడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, సీనియర్ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోకెస్ పర్సన్ రామ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News