డొనేషన్ల పేరుతో లక్షల్లో వసూల్లు..

రాష్ట్రంలో విద్య ఇప్పటికే వ్యాపారంగా మారింది. భారీ స్థాయిలో ఫీజులు గుంజడమే కాకుండా పలు కాలేజీల యాజమాన్యాలు డొనేషన్ల పేరుతో వసూలు చేస్తుండడంతో సామాన్యుల నడ్డి విరుగుతోంది.

Update: 2024-05-26 02:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో :రాష్ట్రంలో విద్య ఇప్పటికే వ్యాపారంగా మారింది. భారీ స్థాయిలో ఫీజులు గుంజడమే కాకుండా పలు కాలేజీల యాజమాన్యాలు డొనేషన్ల పేరుతో వసూలు చేస్తుండడంతో సామాన్యుల నడ్డి విరుగుతోంది.ఈ డొనేషన్ల ప్రక్రియ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో యథేచ్ఛగా సాగుతోంది. లక్షల్లో వసూలు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా పలు యాజమాన్యాలు ఈ దందాను కొనసాగిస్తున్నాయి. మార్కెట్ లో లేని కొరతను సృష్టించి విద్యార్థులను అయోమయానికి గురి చేసి తమ కాలేజీల్లో చేర్చుకునేలా చేయడంతో పాటు వారి నుంచి డొనేషన్లను లాగుతోంది. రోజుకో రేటుతో విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయి. దీంతో డబ్బున్నోళ్లకే చదువులు అన్నట్లుగా పరిస్థితి మారింది. సామాన్యుల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది.

రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. మిగతా 30 శాతం సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. ‘ఏ’ కేటగిరీ సీట్లను ఎంసెట్ పరీక్ష నిర్వహించి కన్వీనర్ కోటా ద్వారా ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వమే అడ్మిషన్లు చేపడుతుండగా, ‘బీ’ కేటగిరీ సీట్లను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి కళాశాల యాజమాన్యాలు అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంటుంది. కానీ పలు కాలేజీల యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా విద్యా వ్యాపారానికి తెరలేపుతున్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉన్న లోపాలను ఆసరా చేసుకుని పలు యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. మార్గదర్శకాలను విస్మరిస్తూ యాజమాన్య కోటా సీట్లకు బహిరంగంగా లక్షల్లో డోనేషన్లు వసూళ్లు చేస్తూ కోట్లలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రైవేటు యాజమాన్యాలు ఒక్కో విద్యార్థిపై లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ మరోవైపు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నట్లు పేపర్ ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. రికార్డుల కోసం ప్రభుత్వానికి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తూ కాసుల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఎంసెట్ ఫలితాల ఆధారంగా కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతిభ ఆధారంగా కేటాయించాల్సిన బీ కేటగిరీ సీట్లను ఎంసెట్ పరీక్ష నిర్వహించకముందే మార్కెట్‌లో పోటీ లేకున్నా.. కృత్రిమ కొరతను సృష్టించి రోజుకో రేటుతో విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయి. కాగా అక్రమంగా డొనేషన్లు వసూలు చేయడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి

అక్రమంగా డొనేషన్లు వసూళ్లు చేస్తున్న కాలేజీలపై క్రిమినల్ కేసులు పెట్టాలి. కొన్ని యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అడ్మిషన్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కూడా అప్లికేషన్ తీసుకోవాలి. మొదటి ప్రయారిటీలో జేఈఈ ర్యాంకర్ లను, తర్వాత ఎంసెట్, ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకోవాలి. కానీ యాజమాన్యాలు ఇవేవీ పట్టించుకోవట్లేదు. నోటిఫికేషన్ టైంలోనూ దరఖాస్తులను స్వీకరించడం లేదు. తీసుకున్నా వాటిని పక్కన పడేస్తున్నారు. గత ఏడాది ఈ అంశాలపై ఫిర్యాదు చేయడంతో ఉన్నత విద్యామండలి స్పందించి యాజమాన్యాలు అప్లికేషన్ తీసుకోకుంటే తమకు సమర్పించాలని ఆదేశాలిచ్చింది. అయినా తప్పుడు వివరాలతో కాలేజీలు గట్టెక్కుతున్నాయి. దీంతో మెరిట్ విద్యార్థులు కూడా కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందలేకపోతున్నారు. ఈ విషయమై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కి వినతిపత్రం అందించాం. ఇలాంటి కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని కోరాం.:-బైరు నాగరాజు గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు, నవ తెలంగాణ స్టూడెంట్ యూనియన్

Similar News