పార్టీ మారగానే ఒపీనియన్ మారుతుందా?.. ఆ విషయంలో చర్చగా మారిన ఆర్ఎస్పీ తాజా వ్యాఖ్యలు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి చర్చగా మారారు.

Update: 2024-05-18 07:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పాలిటిక్స్ లోకి ఎంట్రి ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి చర్చగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసిన న ఆర్ఎస్పీ ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఇటీవలే బీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే పార్టీ మారగానే ఆయన మాటల్లోనూ తేడా వచ్చిందంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కవితతో ములాఖత్ అయిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని.. పార్టీ మారగానే ఒపీనియన్ మారుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు ఆర్ఎస్పీ నిన్న ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ కవిత అరెస్ట్ వెనుక పొలిటకల్ కుట్ర దాగి ఉందని, బీజేపీ కుట్ర పూరితంగా కవితను ఈ కేసులో నిందితురాలిగా చేర్చారని ఆరోపించారు. అయితే ఇదే ఆర్ఎస్పీ గతే డాది సెప్టెంబర్ 20వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహుజన దండయాత్ర సభలో మాట్లాడుతూ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసులో లంచం తీసుకున్న మనీశ్ సిసోడియా జైల్లో ఉంటే.. వంద కోట్లు లంచం ఇచ్చి వెయ్యి కోట్లు లాభాలు పొందడానికి ప్రయత్నించిన కవిత బయట ఎట్లుందని సూటిగా ప్రశ్నించారు. దీంతో కవిత విషయంలో పార్టీ మారగానే ఆర్ఎస్పీ అభిప్రాయం మారిందనే టాక్ వినిపిస్తోంది. మేధావి వర్గం నుంచి వచ్చిన ఆర్ఎస్పీ తనదైన పంథాలో పాలిటిక్స్ చేస్తారనుకుంటే ఇదేం అవకాశవాద రాజకీయం అని పార్టీ మారగానే అభిప్రయాలు మార్చుకోవడం ఏంటంటూ ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితికి తీసుకువస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News