రైతన్నలను వంచించేందుకు నకిలీల ప్రయత్నం..అప్రమత్తంగా లేకుంటే అంతే

ఎండాకాలంలో మంచిగా దిగుబడులు రాలేదు. వానా కాలంలో అయినా పంటలు విత్తి పండించాలనకుంటున్న రైతులను నాసిరకం విత్తనాలు భయపెడుతున్నాయి.

Update: 2024-05-25 02:04 GMT

దిశ ప్రతినిధి,నిజామాబాద్: ఎండాకాలంలో మంచిగా దిగుబడులు రాలేదు. వానా కాలంలో అయినా పంటలు విత్తి పండించాలనకుంటున్న రైతులను నాసిరకం విత్తనాలు భయపెడుతున్నాయి. గత రబీ సీజన్‌లో నిజామాబాద్ జిల్లా కోటగిరి, కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో రైతులను నిండా ముంచినవి నాసిరకం విత్తనాలే. ఉమ్మడి జిల్లాలో సాధారణంగా వరిని 110 రోజుల పంటగా సాగు చేస్తారు. అది ఎండాకాలం కాబట్టి దాన్ని కచ్చితంగా పాటిస్తారు. రైతులు మంచి విత్తనాలు కావాలంటే వ్యాపారులు మాత్రం మంచి దిగుబడి వస్తుందని చెప్పి నమ్మించి 140 రోజులకు చేతికి వచ్చే పంట రకం విత్తనాలు అంటగట్టి చేతులు దులుపుకున్నారు. ఎండాకాలం నిజాం సాగర్ నీటి పారకం జరిగినన్ని రోజులలో రావాల్సిన పంట చేతికి అందక పోవడంతో రైతులు ఆందోళన పడ్డారు. కానీ అవి 140 రోజులకు రావడం అప్పటికే నీటి తడులు అందకా వరి దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.

ఈ విషయంపై ఫిర్యాదు చేయగా కంపెనీల నుంచి వచ్చిన అధికారులు కొన్ని చోట్ల రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించి కేసులను మాఫీ చేయించుకోవడం విశేషం. ఎక్కువ శాతం వరి పండించే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ప్రతీతి. వరి విత్తనాలు చాలా మటుకు నిజామాబాద్ జిల్లాలోనే లభిస్తాయి. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు కొదవలేదు. విత్తనాభివృద్ధి సంస్థ కూడా రైతులు విత్తనపు వడ్లు ఇస్తుండగా సంప్రదాయంగా కొందరు రైతులు తమ పంట పొలాల్లో విత్తనపు వడ్లు పండించి వాటిని ప్రత్యేకంగా నిల్వ చేసి తోటి రైతులకు అందిస్తూ ఆదుకుంటున్నారు. వరి విషయంలో జిల్లాలో నకిలీ విత్తనాల సంగతి దేవుడెరుగు కానీ నాసిరకం విత్తనాల విషయం జిల్లాలో గత ఎండాకాలంలో బహిర్గతమైంది. ఉమ్మడి జిల్లాలో వరితో పాటు అధికంగా సోయా, పత్తి, మిరప పంటలను పండిస్తున్నారు. అందులో నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టి వ్యాపారులు రైతులను నిండా ముంచుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్‌లో పత్తి, సోయా, మిరపను జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పండిస్తారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో అధికంగా పత్తి పండిస్తున్నారు. మిరప పంటను అధికంగా అంతర పంటగా పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలి విత్తనాలు బదులు నాసిరకం విత్తనాలు రైతులకు అంటగడుతున్నారు. సోయా విత్తనాలు ప్రభుత్వం అందించే వాటికంటే బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నవి ఎక్కువ . దాన్ని ఆధారంగా చేసుకుని వ్యాపారులు రైతులకు నకిలీలు అటుంచి నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు, నాసిరకం విత్తనాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి సరఫరా అవుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ సరిహద్దులోని ధర్మాబాద్ ప్రాంతం నుంచి పత్తి, మిరప, సోయా విత్తనాలను తీసుకువచ్చి వ్యాపారులు రైతులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా లైసెన్సులు ఇచ్చిన కొన్ని సంస్థల అవుట్ లెట్ ల నుంచి విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయి.

ధర్మాబాద్ నుంచి జిల్లా కేంద్రంలో గోదాం రోడ్డులో కొందరు వ్యాపారులు వాటిని తీసుకొచ్చి అమ్ముతున్నారని బహిరంగ రహస్యమే. నకిలీ విత్తనాలయితే కంపెనీల ద్వారా గుర్తించవచ్చు. నాసిరకం విత్తనాల్లో బెరుకులు ఎక్కువగా ఉంటాయి. అంతేగాకుండా వాటికి రంగు పూసి ప్రాసెసింగ్ చేశామని మంచి కంపెనీల కవర్లలో సీజ్ చేసి విక్రయించడం జరుగుతుంది. అంతేగాకుండా కొందరు విత్తనాలను ఎలాంటి ప్రాసెస్ చేయకుండానే విక్రయిస్తుండడంతో డబుల్ లేబుల్, సింగిల్ లేబుల్ విధానంలో ఈ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో వ్యవసాయ, పోలీసు శాఖల తనిఖీలు నిర్వహిస్తున్న ఇప్పటి వరకు నాసిరకం విత్తనాలు పట్టుబడక పోవడానికి కారణం ఉంది. రైతులు దుక్కులు దున్నుకుని పంటలు పండించేందుకు విత్తనాలు విత్తేటప్పుడు అవి మొలకలు రాకపోవడం లేదా సమయానికి పూత పూయకపోవడం, కాత కాయకపోవడం జరిగినప్పుడే అవి నాసిరకం విత్తనాలే అని తేలుతాయి. అధికార యంత్రాంగం కేవలం విత్తనాలను క్రయవిక్రయాలప్పుడు మాత్రమే తనిఖీలు నిర్వహించడం, సాగుకు సమాయత్తం అయినప్పుడు మాత్రమే విత్తన కంపెనీలు దుకాణాలను తనిఖీ చేయడం జరుగుతుంది. దాంతో రైతులు నష్ట పోయినప్పుడు మాత్రమే ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చే విత్తనాలను నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వినియోగిస్తున్న అప్పుడే గుర్తిస్తే రైతులకు వచ్చే నష్టాన్ని నివారించవచ్చు.

Similar News