తెలంగాణలో వారికి మేలు చేసేందుకే ధరణి: కేసీఆర్‌పై వీహెచ్ ఫైర్

ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్ పార్టీ తీసేయాలని అంటోందని, దానిని తీసేస్తే మళ్లీ చిట్టీలు పట్టుకుని సేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని నాగర్ కర్నూల్ సభలో సీఎం కేసీఆర్

Update: 2023-06-07 12:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్ పార్టీ తీసేయాలని అంటోందని, దానిని తీసేస్తే మళ్లీ చిట్టీలు పట్టుకుని సేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని నాగర్ కర్నూల్ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ధరణి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పాలవుతున్నారని ఈ విషయం తెలుసుకుని సీఎం మాట్లాడాలన్నారు. ధరణి పోర్టల్‌ను ఆసరాగా చేసుకుని గతంలో ప్రభుత్వాలు నిరుపేదలకు పంచిన భూములను అక్రమంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇలా చేసుకునే క్రమంలో రెవెన్యూ అధికారులు సైతం వారి పేర్ల మీదకు భూములను మార్చుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నాయని ధ్వజమెత్తారు.

ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. పేదవాడికి న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ధనవంతులకు మేలే చేసేందుకే ధరణి అమలు అవుతోందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరిలోనూ అవకతవకలు జరుగుతున్నాయని.. నిజమైన అర్హులకు కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకు, ధనవంతులకు ప్రభుత్వం ఇండ్లు ఇస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌కు నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News