CM రేవంత్ సంచలన నిర్ణయం.. తన మార్క్ పాలన చూపేలా ప్లాన్!

సంక్షేమ పథకాల్లోనే కాదు.. పరిపాలనా పరంగా పలు విధాన నిర్ణయాల్లో మార్పులు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తన మార్క్‌ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

Update: 2024-05-24 02:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సంక్షేమ పథకాల్లోనే కాదు.. పరిపాలనా పరంగా పలు విధాన నిర్ణయాల్లో మార్పులు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తన మార్క్‌ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉనికిలోకి వచ్చి ఇప్పటికీ అమలవుతున్న స్కీమ్‌లలో కొన్నింటిని పక్కన పెట్టేందుకు సీఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం ‘టీఎస్’ పేరుతో పిలుచుకుంటున్న అబ్రివేషన్‌ను ‘టీజీ’గా మార్చి సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఎంబ్లమ్ (లోగో)లోనూ మార్పులు జరుగబోతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా ఆర్టిస్టులు, డిజైనర్ల నుంచి ప్రతిపాదనలు స్వీకరించే ప్రాసెస్ షురూ అయ్యింది. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేస్తామని, సామాన్య మహిళా స్ఫూర్తి ఉట్టిపడేలా చేంజెస్ చేస్తామని సీఎం గతంలోనే స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేయడంపై కొంతకాలంగా జరుగుతున్న కసరత్తు వివిధ విభాగాలకు ఆదేశాల రూపంలో వెళ్లింది.

కొత్త పాలసీలు.. గైడ్ లైన్స్

గత ప్రభుత్వంలో విప్లవాత్మకమైన నిర్ణయంగా చెప్పుకున్న టీఎస్-ఐపాస్ పాలసీని మార్చడంపై పరిశ్రమల శాఖతో రివ్యూ సందర్భంగా సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఒక్క పాలసీ స్థానంలో ఆరు పాలసీలు వస్తాయని, దానికి తగినట్లు గైడ్‌లైన్స్ రూపొందించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కోడ్ ముగిసేలోపే ముసాయిదా తయారు చేయాలని, ఆ తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా వారికి దిశానిర్దేశం చేశారు. దాదాపు పన్నెండు పాలసీలకు మార్పులు చేయడంపై ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ప్రాసెస్ షురూ చేసింది. గత ప్రభుత్వంలో ‘మన ఊరు – మన బడి’ స్కీమ్ ఆర్భాటంగా ప్రారంభమైనా.. దానికి తగిన నిధుల విడుదల చేయక పోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం దాని స్థానంలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు’ అనే కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.

మరోసారి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ

గత పాలనలో అప్పటి సీఎం కేసీఆర్‌కు లక్కీ నంబర్‌గా ఉండే ‘ఆరు’కు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రానికి కొనసాగింపుగా వచ్చిన పది జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్నీ ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించి మరోసారి జిల్లాలను పునర్ వ్యవస్థీకరించాలని భావిస్తున్నది. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, ఒకే అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉండే కొన్ని మండలాలు వేర్వేరు ప్రాంతాల్లోకి వెళ్లాయని, దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో ఆయా జిల్లాలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తున్నదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో జిల్లాల సంఖ్యను తగ్గించి 17కు కుదించేలా మార్పులు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిసింది. ఇక ‘రైతుబంధు’ స్కీమ్ ‘రైతుభరోసా’గా, ‘ఆసరా’ స్కీమ్ ‘చేయూత’గా మారిపోతున్నాయి. దాదాపు పన్నెండు పాలసీలకు మార్పులు జరుగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

తప్పిదాలు లేకుండా..

సంక్షేమ పథకాల్లోనే కాకుండా.. పరిపాలనాపరంగా విధాన నిర్ణయాల్లో మార్పులు చేయాలని సీఎం భావిస్తున్నారు. పరిశ్రమల విభాగానికి గత ప్రభుత్వం రూపొందించిన టీఎస్-ఐపాస్ పాలసీని విభజించి ఇకపైన ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్‌పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్) పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ వంటి పేర్లతో రూపొందించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా, ఆ స్కీమ్‌లలోని వైఫల్యాలు ఇకపైన రిపీట్ కాకుండా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలన్నది సీఎం ఉద్దేశం. గత ప్రభుత్వంలో కొనసాగిన అనేక స్కీమ్స్ ఇప్పుడు ఉనికిలో లేకుండా పోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పేరుతో గతేడాది ప్రారంభమైన స్కీమ్ అమలుకు నోచకుండా పోయింది.

ఆగస్టు తర్వాత కీలక మార్పులు

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపైనా దృష్టి పెట్టనున్న సీఎం.. ఆగస్టు తర్వాత పూర్తి స్థాయిలో పరిపాలనలో సంస్కరణలు, విధాన నిర్ణయాల్లో కీలక మార్పులు చేపట్టాలని భావిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి అంశాలు రెండు కండ్లు అంటూ సీఎం సహా మంత్రులంతా వ్యాఖ్యానించడంతో పరిపాలనలో కొత్త ఒరవడి తెరమీదకు వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Similar News