నేరుగా మోడీనే ఢీకొడుతోన్న రేవంత్.. కుంభస్థలాన్నే కొట్టాలన్న వ్యూహంలో సీఎం..!

ప్రధాని మోడీని ఒక సభలో బడే భాయ్ అంటూ కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్న సీఎం రేవంత్.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయననే టార్గెట్ చేస్తున్నారు.

Update: 2024-04-29 02:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీని ఒక సభలో బడే భాయ్ అంటూ కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్న సీఎం రేవంత్.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయననే టార్గెట్ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య జరిగే ఎలక్షన్ వార్‌లో సీఎం రేవంత్ వర్సెస్ పీఎం మోడీ తరహాలో ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రానికి బీజేపీ చీఫ్ ఉన్నా ఆయన స్వయంగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తుండటంతో క్యాంపెయిన్‌లో మునిగిపోయారు.

బీజేపీని రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిగా చూస్తున్న సీఎం రేవంత్ ఇప్పుడు తన దృష్టి మొత్తాన్ని ప్రధాని మోడీపైనే పెట్టారు. ఆయనను బీజేపీ ఇమేజ్‌గా భావిస్తుండటంతో కుంభస్థలాన్నే కొట్టాలన్న భావనతో బాణాలన్నింటినీ ఆయనపైకే ఎక్కుపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ ఫేస్‌గా రాష్ట్రమంతా బహిరంగసభలు, రోడ్ షో లు, ర్యాలీల రూపంలో రేవంత్ రంగంలోకి దిగారు.

అన్నీ తానై రేవంత్‌రెడ్డి క్యాంపెయిన్

అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ఎన్నికల ప్రచారానికి వచ్చినా లోక్‌సభ క్యాంపెయిన్‌లో మాత్రం రేవంత్‌రెడ్డి అన్నీ తానై నడిపిస్తున్నారు. ప్రియాంకాగాంధీ చౌటుప్పల్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మే నెల ఫస్ట్ వీక్‌లో ప్రచారానికి వస్తున్నా ఈసారి క్యాంపెయిన్ మొత్తం రేవంత్ చేతుల మీదుగానే నడుస్తున్నది.

సీఎం వర్సెస్ పీఎం తరహాలో జరుగుతున్న ఎన్నికలు రెండు పార్టీలకూ కీలకంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరహాలోనే కేంద్రంలోనూ కాంగ్రెస్ పవర్‌లోకి వస్తుందనే ధీమాతో తెలంగాణలో మిషన్-15 టార్గెట్ పెట్టుకున్నారు. మరోవైపు బీజేపీ సైతం గతంలో నాలుగు సీట్లకే పరిమితమైనా ఈసారి డబుల్ డిజిట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

డబుల్ డిజిట్ బీజేపీ టార్గెట్

తెలంగాణను సౌతిండియాకు ‘గేట్ వే’గా మార్చుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ నేషనల్ చీఫ్ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు హాజరవుతూ ఉన్నారు. తెలంగాణలో ఈసారి సీట్ల సంఖ్యను డబుల్ కంటే ఎక్కువ పొందేలా ప్రత్యేక దృష్టి పెట్టింది. దక్షిణ భారత్‌లో పట్టు పెంచుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే తెలంగాణ నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేసుకుంటున్నది. ఎంపీ సీట్ల సంఖ్యనూ పెంచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. పార్లమెంటు ఎలక్షన్ షెడ్యూలు రిలీజ్ కావడానికి ముందే 3 సార్లు స్టేట్‌లో పర్యటించిన ప్రధాని మోడీ మరో మూడు రోజుల పాటు ఐదారు ఎంపీ సెగ్మెంట్లలో జరిగే బహిరంగసభల్లో ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అంటూ ఎటాక్

ప్రధాని మోడీకి కౌంటర్‌గా ఆయన స్థాయికి తగినట్లుగా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ లాంటివారిని రంగంలోకి దించే వ్యూహానికి బదులుగా స్వయంగా రేవంత్‌రెడ్డే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల రిజర్వేషన్ విషయంలో ప్రధాని చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. పదేండ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి పనులకు అనుమతులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఉన్నత విద్యాసంస్థల స్థాపనలో నిర్లక్ష్యం..ఇలాంటివాటిలో అన్యాయం చేశారని పలుమార్లు ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆయనతోనే తలపడేందుకు రెడీ అవుతున్నారు. ఎలాగూ బీఆర్ఎస్‌తో పెద్దగా చిక్కులే లేవని ఓపెన్‌గానే చెప్తున్న సీఎం రేవంత్.. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని కట్టడి చేస్తామన్న ధీమానూ వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ దారిలోనే సీఎం కౌంటర్లు

రాముడు, దేవుడు, హిందుత్వ అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చి విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో హామీల అమలుపై దేవుళ్ల మీద ఒట్టేసి చెప్తూ ఆ దారినే ఎంచుకున్నారు. లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతారంటూ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పదేపదే కామెంట్ చేస్తున్న సమయంలో మోడీనే టార్గెట్ చేస్తూ బలంగా విమర్శిస్తుండటం గమనార్హం. రిజర్వేషన్ల విషయంలో మోడీ, అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన రేవంత్‌రెడ్డి.. ఆర్ఎస్ఎస్ లక్ష్యాన్ని పుల్‌ఫిల్ చేయడానికి బీజేపీ కంకణం కట్టుకున్నదని, దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలిచి రాజ్యాంగంలో సమూల మార్పులు చేసే కుట్ర ఉన్నదంటూ స్వరం పెంచారు. బీజేపీలో మోడీనే రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకుని ఒకే సమయంలో అటు బడే భాయ్.. ఇటు బీజేపీలోకి వెళ్తారనే కామెంట్లకు బ్రేక్ వేస్తున్నారు.


Similar News