తగ్గేదే లే.. రిజర్వేషన్లపై CM రేవంత్ రెడ్డి Vs BJP

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి తగ్గేదే లే.. అనే తీరులో స్పష్టమైన వైఖరితో ఉన్నారు.

Update: 2024-05-01 03:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి తగ్గేదే లే.. అనే తీరులో స్పష్టమైన వైఖరితో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్‌కు వచ్చి నోటీసులిచ్చినా సీఎం రేవంత్ డోన్ట్ కేర్ అనే తీరులోనే ఉన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలోనే బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ మరోసారి పవర్‌లోకి వస్తే రిజర్వేషన్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తుందంటూ రెండ్రోజుల క్రితం చేసిన కామెంట్లనే మరోసారి కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్‌లో ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ నొక్కిచెప్పారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తున్నదంటూ ఆరోపించారు. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ హిడెన్ అజెండాను, బీజేపీ 400 సీట్లు గెల్చుకోవాలని పెట్టుకున్న లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఈ అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

“నేను రిజర్వేషన్ల పైన మాట్లాడిన ఒక్క రోజులోనే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు.. సరిహద్దులో సైనికులను కూడా తెచ్చుకో.. నేను భయపడేది లేదు.. రిజర్వేషన్ల గురించి బీజేపీ కుట్రను ప్రశ్నించినందుకు నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు.. కేసీఆర్ నన్ను గతంలో అక్రమంగా అరెస్టు చేసినట్లే ఇప్పుడు మోడీ సైతం అదే పద్ధతిని అవలంభిస్తున్నారు.. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారు.. అందుకే గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులను పంపించారు.. నన్ను అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశించారు.. రజాకార్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డది..” అంటూ సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా మాటలతో ఫేక్ వీడియో సృష్టించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే సీఎం రేవంత్ పై కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రధాన ప్రచారాస్త్రంగా రిజర్వేషన్ ఇష్యూ

‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే బంగారాన్ని లాక్కుంటుంది. పుస్తెల తాడుకూ గ్యారెంటీ ఉండదు.’ అంటూ ప్రధాని మోడీ ఇటీవల విరుచుకుపడిన నేపథ్యంలో దానికి కౌంటర్‌గా రిజర్వేషన్ అంశాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్ హిడెన్ అజెండా అంటూ విమర్శించడంతో స్వయంగా ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తెలంగాణకు వచ్చి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. మరోవైపు బీజేపీ భవిష్యత్తు యాక్షన్ ప్లాన్‌ రిజర్వేషన్లపై సర్జికల్ స్ట్రైక్స్ అంటూ రెండ్రోజుల క్రితం చేసిన కామెంట్లనే మరోసారి సీఎం రేవంత్ రిపీట్ చేయడంతో ఎన్నికలయ్యేంత వరకూ ఈ అంశాన్నే కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. రిజర్వేషన్లపై వైఖరిని వెల్లడించాలంటూ మోడీకి డిమాండ్ చేయడంతో ఆయన నుంచి స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించబోమని ఉమ్మడి మెదక్ జిల్లాలోని బహిరంగసభ ద్వారా పీఎం మోడీ స్పష్టత ఇచ్చారు.

జనాభా దామాషా ప్రకారం పెంచుతాం

బీజేపీ మళ్లీ పవర్‌లోకి వస్తే రిజర్వేషన్లపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందని ఆ పార్టీపై ఆరోపణలు చేస్తూనే కాంగ్రెస్ వస్తే ఏం చేయబోతున్నదో కూడా ప్రజలకు స్పష్టత ఇచ్చారు. జనాభా దామాషా ప్రకారం ఈ రిజర్వేషన్లను సవరిస్తామని, ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు పెరుగుతుందని వివరించారు. అందుకోసమే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని, ఆ గణాంకాల ఆధారంగా ఓబీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టం చేశారు. ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెంచుతుందని భరోసా కల్పించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చినట్లుగా బీజేపీ స్పష్టత ఎందుకు ఇవ్వడంలేదని పదేపదే సీఎం రేవంత్ ప్రస్తావిస్తుండడంతో తెలంగాణ గడ్డ మీద నుంచే ప్రధాని తనదైన శైలిలో కొంత స్పష్టత ఇవ్వక తప్పలేదు.

ఢిల్లీ పోలీసుల నోటీసులు బేఖాతర్

రిజర్వేషన్లపై మాట్లాడినందుకే తనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్... వాటిని లెక్కచేయదల్చుకోలేదనే మెసేజ్ ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారం నేడు ఢిల్లీలోని ఐఎఫ్ఎస్‌ఓ (ఇంటెలిజెన్స్ ఫ్యూజన్స్ అండ్ స్ట్రాటెజిక్ ఆపరేషన్స్) ఇన్‌స్పెక్టర్ నీరజ్ చౌదరి ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. కానీ హాజరు కావడం లేదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. దీనికి తోడు నేటి రేవంత్ ఎలక్షన్ క్యాంపెయిన్ షెడ్యూలు కూడా ఖరారైంది. కోరుట్ల, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సమన్ల ప్రకారం ఆయన హాజరయ్యే అవకాశం లేదని స్పష్టమైంది.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాని మోడీ స్వయంగా రిజర్వేషన్లపై స్పష్టమైన కామెంట్లు చేసినా, సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు క్లారిటీ ఇచ్చినా ఆయన మాత్రం వెనక్కు తగ్గడంలేదు. సీఎం రేవంత్ వ్యూహాన్ని గ్రహించిన ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పెట్టిందే తాను.. ఏనుగు అంబారీపై ఊరేగింపుగా తీసుకెళ్లానని, తాను మాత్రం నడిచే వెళ్లానని, పార్లమెంటు సభ్యుడైన తర్వాత అడుగు పెట్టేముందే మెట్లకు మొక్కానని.. ఇలాంటి అంశాలను కూడా ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని సవరించాలని బీజేపీ కుట్ర చేస్తున్నదంటూ సీఎం రేవంత్ కామెంట్లు చేస్తూ ఉంటే... అపారమైన గౌరవం ఉన్నదంటూ ప్రజలకు నమ్మకం కలిగించేలా మోడీ తనదైన శైలిలో ప్రజలకు బహిరంగసభల ద్వారా వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు రిజర్వేషన్ల అంశం ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది.


Similar News