‘ఆకస్మిక తనిఖీలు చేస్తా.. వేటు తప్పదు’.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ప్రస్తుతం అమల్లో ఉన్న విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇకపైన

Update: 2024-05-25 17:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం అమల్లో ఉన్న విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇకపైన వివిధ విభాగాలతో కూడిన సిస్టమ్‌గా పనిచేయాలని అధికారులకు సూచించారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు మాత్రమే అలర్టుగా ఉండే ఈ వ్యవస్థ ఇకపైన సంవత్సరం పొడవునా పనిచేసేలా తయారుకావాలని, అందుకు అనుగుణంగా జూన్ 4వ తేదీకి పకడ్బందీ ప్రణాళికను తయారుచేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.

సిటీ శివారు ప్రాంతంలో ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపలి భాగంగా ఒకే యూనిట్‌గా పనిచేసేలా ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారిని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో భాగస్వాముల్ని చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం సాయంత్రం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని లోతుగా జరిగిన చర్చల అనంతరంపై అంశాలను ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

హైదరాబాద్ సిటీకి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి విపత్తు నిర్వహణ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసాలా కొత్త మెకానిజం రూపొందాలని ఆఫీసర్లకు సూచించారు. వర్షాకాలానికి మాత్రమే పరిమితం కాకుండా 365 రోజులూ ఈ వ్యవస్థ పనిచేసేలా ప్రణాళికను జూన్ 4వ తేదీలోగా రూపొందించాలని స్పష్టం చేశారు.

ఈ కొత్త మెకానిజంలోకి వచ్చే వివిధ విభాగాల అధికారులు బాధ్యత వహించేలా ఉండాలన్నారు. సిటీలోని మురుగునీటి కాల్వల (నాలాల) విషయంలో సంబంధిత అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, పూడిక తీసిన వ్యర్థాన్ని సమీప ప్రాంతాలకు తరలించాలన్నారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించడం ఉత్తమమని సూచించారు. ఈ పనులు ఆశించిన స్థాయిలో జరుగుతున్నాయో లేవో ఎలక్షన్ కోడ్ ముగిసిన తరువాత స్వయంగా తానే ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తానన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించిన ఆయన కఠిన చర్యలు తప్పవన్నారు. ఓపెన్ సెల్లార్ గుంతల దగ్గర తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ బారీకేడింగ్ సిస్టమ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఇకపైన అలాంటివి రిపీట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని నాలాల విషయంలో సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని నొక్కిచెప్పారు.

సమస్యాత్మకంగా ఉన్న నాలాల దగ్గర అవసరమైతే ప్రతిరోజూ క్లీనింగ్ చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే ఏ స్థాయిలో ఉన్న సిబ్బందైనా సహించేది లేదన్నారు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని, తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పనిచేసేవారిని ప్రోత్సహించడంతో పాటు ఉన్నత స్థానం కల్పిస్తామని, అలసత్వంతో ఉన్న సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు.

విద్యుత్ రంగానికి సంబంధించి కూడా ఆ విభాగం అధికారులకు నిర్దిష్టమైన సూచనలు చేశారు. పవర్ సప్లైలో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆ శాఖదేనని నొక్కిచెప్పారు. పవర్ మేనేజ్‌మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం ఏ స్థాయిలో నమోదైందో, సాధారణంతో పోలిస్తే వ్యత్యాసం ఏ మేరకు ఉన్నదో గణాంకాలతో సహా అధికారులు ఇచ్చిన వివరాలను బేరీజు వేసుకున్న సీఎం రేవంత్.. వరదల విషయంలో మాత్రమే కాక విద్యుత్ వ్యవస్థపైనా పడే ప్రభావాన్ని అంచనా వేసి దానిని దీటుగా ఎదుర్కొనేందుకు తగిన ప్లానింగ్ ఉండాలని నొక్కిచెప్పారు. ఎన్ని రోజులు వర్షం కురిసింది, దాని తీవ్రత ఎంత ఉన్నది, చెట్లు పడిపోవడం లాంటి సమస్యలతో విద్యుత్ సరఫరాకు కలిగిన ఆటంకం తదితరాలపైనా రివ్యూ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముగ్గురు పోలీసు కమిషనర్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, విద్యుత్ శాఖ, వైద్యారోగ్యం, సీఎంఓ తదితర పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 

Similar News