ఇది తీన్మార్ ఎన్నిక కాదు.. కాంగ్రెస్ పార్టీ‌ది: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన

Update: 2024-05-22 16:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైన ఎన్నికని వివరించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. బుధవారం సీఎం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్‌లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమన్నారు.

మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్చార్జ్‌లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి, పార్టీ విజయానికి చొరవ చూపాలన్నారు. ఈ నెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ప్రతీ ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని, సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న గెలుపు ఉపయోగపడుతుందన్నారు.

Similar News