బిగ్ న్యూస్: విపక్షాల ఉచ్చులో BRS ఎమ్మెల్యేలు.. ఆ గులాబీ నేతల కదలికలపై KCR నిఘా..?
అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉండేదెవరు.. జారిపోయేదెవరు.. విపక్షాల ఉచ్చులో చిక్కుకునేదెవరు.. ఆఫర్ల ప్రలోభాలకు లొంగుతున్నారా?
దిశ, తెలంగాణ బ్యూరో: అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉండేదెవరు.. జారిపోయేదెవరు.. విపక్షాల ఉచ్చులో చిక్కుకునేదెవరు.. ఆఫర్ల ప్రలోభాలకు లొంగుతున్నారా?.. అని సిట్టింగ్ల కదలికలపై కేసీఆర్ నిఘా పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుంటే చేజారి పోతారా అనే వివరాలు సైతం సేకరిస్తున్నారు. ఊగిసలాటలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేదానిపై డేటా తెప్పించుకుంటున్నారు పార్టీ అధినేత. ఇటీవల వచ్చిన విపక్షాల పిలుపులపై ఆరా తీస్తున్న కేసీఆర్.. వచ్చే నెల నుంచి సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో గులాబీ ఎమ్మెల్యేలు టికెట్ వస్తుందా? రాదా? అనే ఊగిసలాటలో ఉన్నారు. విపక్షాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు. పార్టీలోకి వస్తే టికెట్ హామీతో పాటు ఎన్నికల ఖర్చంతా తామె భరిస్తామని హామీలు ఇస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం అలర్టు అయింది. విపక్షాల ఉచ్చులో చిక్కుకునేదెవరు.. వారి ఆఫర్ల ప్రలోభాలకు లొంగుతున్నారా అనే వివరాలను పార్టీ అధిష్టానం సేకరిస్తుంది.
సిట్టింగ్‌ల కదలికలు, ఇతర పార్టీ నేతలతో ఎవరైనా టచ్‌లో ఉన్నారా? టికెట్ ఇవ్వకుంటే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమిటీ? వారు పార్టీ మారితే ఏమైన నష్టం జరుగుతుందా అనే వివరాలను సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో సగం మందికి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ఆఫర్లు వచ్చాయి.
అయితే అధికారంలో ఉన్న పార్టీని వదులుకోవడానికి సిద్ధపడలేదు. అయితే రాబోయే ఎన్నికల్లో్ సిట్టింగ్ లకు కేసీఆర్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ తీరా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ ఇస్తారా అనే సందిగ్ధం ఎమ్మెల్యేల్లో నెలకొంది. టికెట్‌పై మల్లగుల్లలు పడుతున్నారు. దీంతో పక్కచూపులు చూస్తున్న నేతలపై కేసీఆర్ ప్రత్యేక నిఘాపెట్టినట్లు తెలిసింది.
అధికార బీఆర్ఎస్ పార్టీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో సుమారు 40 మందిని మారుస్తారనే ప్రచారం జరుగుతుంది. వ్యతిరేకతతోనే వారికి ఉద్వాసన పలుకనున్నారని సమాచారం. దీనికి తోడు పలు నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వంతో గ్రూపు రాజకీయాలు తీవ్రమయ్యాయి. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను సొంతంగా నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల్లో గెలిచి గులాబీ గూటికీ సుమారు 17మంది చేరారు.
అయితే ఆ నియోజకవర్గాల్లోనే కాకుండా బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లోనూ బహుళ నాయకత్వంతో విభేదాలు ఉన్నాయి. అయితే వీరిలో పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. తాండూరు, నకిరేకల్, మునుగోడు, ఎల్బీనగర్, ఉప్పల్, మెదక్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, రాజేంద్రనగర్ ఇలా పలు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు టికెట్‌ను ఆశిస్తుండటంతో ఇతర పార్టీలు వారిపై ఫోకస్ పెట్టాయి.
వారిని చేర్చుకునే ప్రయత్నాలను స్టార్ట్ చేశాయి. అందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో నలుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ మారుతున్నారని తమ పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధమైందని కాంగ్రెస్, బీజేపీలు ట్రోల్ చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. దీంతో మీడియాకు సంజాయిషీ ఇచ్చుకోక తప్పడం లేదు. అంతేకాదు బీఆర్ఎస్ అధిష్టానం తీరునచ్చక పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలకు ముందు కేసీఆర్‌కు పెద్దఎదురు దెబ్బ తప్పదని మీడియా ముందు విపక్ష నేతలు పేర్కొంటున్నారు.
అలర్టు అయిన కేసీఆర్.. ఆ నేతలు ఎవరు అనే ఆరా తీస్తున్నారు. విపక్షాలు ఎవరెవరికి ఆఫర్ ఇస్తున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. వారిని కట్టడిచేసే ప్రయత్నాలను చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముందుగా వచ్చేవారికే టికెట్ ఆఫర్ అంటూ విపక్షాలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల ఖర్చును సైతం భరిస్తామంటూ పేర్కొంటుండటంతో సిట్టింగ్‌లో డైలామా నెలకొంది. ఏం నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు.
రాబోయే ఎన్నికలకు పార్టీ నేతలను సన్నద్ధం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే నెలలో పార్టీ పటిష్టత, సంక్షేమ, అభివృద్ధిని తెలుసుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నట్లున్నట్లు సమాచారం. ప్రతి రోజూ ఒక నియోజకవర్గం చొప్పున సమీక్ష నిర్వహించి ఆ నియోజకవర్గం పూర్తి వివరాలను తెలుసుకొని చేయబోయే కార్యక్రమాలపైనా షెడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలనే దానిపైన నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.