రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సందేశం
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభానికి ముందురోజు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సందేశం పంపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికే ఆదర్శవంతమైనదిగా ఆవిర్భవించిందని, సకల జనులు మెచ్చే సంక్షేమ పాలనను అందిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. యావత్తు జాతి మెచ్చే సుపరిపాలనను రాష్ట్ర ప్రజలకు అందించాలనే మహోన్నత లక్ష్యంతో, స్పష్టమైన తాత్వికత, సైద్దాంతిక అవగాహనతోనే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును కొత్త సచివాలయానికి పెట్టుకున్నామన్నారు. అనేక అడ్డంకులను అధిగమిస్తూ ధృఢ సంకల్పంతో నూతన సచివాలయ నిర్మాణం జరిగిందని, దేశానికే వన్నె తెచ్చేలా పూర్తి చేసుకున్నామని, ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. లాంఛనంగా ప్రారంభోత్సవం చేయడానికి ముందు ముఖ్యమంత్రి ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారు.
మొత్తం తెలంగాణ సమాజం గర్వించే గొప్ప సందర్భమని అన్నారు. భవిష్యత్తు తరాల పాలనావసరాలకు అనుగుణంగా సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందన్నారు. ప్రజా ఆకాంక్షలకు అనుకూలంగా మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, సాకారం చేసే దిశగా సుపరిపాలన కొనసాగేలా దీన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు. అంబేద్కర్ పేరు పెట్టడం దేశంలోనే మొదటిసారి అని గుర్తుచేశారు. ఈ నామకరణం వెనక సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా, పేద వర్గాలకు సమాన హక్కులు దక్కాలనే సమున్నత లక్ష్యమున్నదన్నారు. సకల జనుల సంక్షేమ పాలనను దేశానికి ఆదర్శంగా అందిస్తూ ఒక మోడల్‌గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా విస్తరించేలా కొత్త సచివాలయం నుంచి మరింత ద్విగుణీకృతమవుతుందన్నారు.
సెక్రటేరియట్ నిర్మాణంలో భాగస్వాములైన రాళ్లెత్తిన కూలీల మొదలు మేస్త్రీలు, కష్టించి పనిచేసిన వృత్తి నిపుణులు, అపురూపమైన డిజైన్ అందించిన ఆర్కిటెక్టులు, విరామమెరుగక పనిచేసిన ఇంజనీర్లు, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగాన్ని కేసీఆర్ అభినందించారు.