రాష్ట్ర అవతరణ వేడుకలకు BRS స్ట్రాటజీ ఫిక్స్..!

రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. పర్మిషన్ కోసం ఎన్నికల సంఘానికి రిక్వెస్టు చేసింది.

Update: 2024-05-24 03:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. పర్మిషన్ కోసం ఎన్నికల సంఘానికి రిక్వెస్టు చేసింది. అనుమతి వచ్చిన తర్వాతనే వేదిక, నిర్వహణ తీరును ఫైనల్ చేయాలని భావిస్తున్నది. అయితే ‘అధికార’ ఉత్సవాలకు దీటుగా బీఆర్ఎస్ సైతం తెలంగాణ భవన్‌లో వేడుకలను నిర్వహించేందుకు రెడీ అవుతున్నది. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించే ఆ పార్టీ నేతలు.. ఆయన చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని చెబుతారు. ఈ లెగసీని ఇలాగే కొనసాగించడానికి ప్రభుత్వం నిర్వహించే ప్రోగ్రామ్‌ను తలదన్నే రీతిలో నిర్వహించాలనే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.

ప్రతిపక్ష హోదాలో ఫస్ట్ టైమ్

ప్రోగ్రామ్ నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ ఇంకా స్పష్టతకు రానట్లు తెలిసింది. అయితే సీనియర్ లీడర్ల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటు అధికారంలో ఉండి ప్రభుత్వ ప్రోగ్రామ్‌గానే నిర్వహించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఫస్ట్ టైమ్ తెలంగాణ భవన్‌లో నిర్వహించడానికి సమాయత్తమవుతున్నది. కేసీఆర్‌ను తెలంగాణ తెచ్చిన హీరోగా నిలబెట్టాలనుకుంటున్నది. పదేండ్ల పాలనా ఫలాలను ప్రదర్శించడమే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఉద్యమానికి ఊపిరులూదిన ఘట్టాలన్నింటినీ ప్రజలకు తెలిసేలా ఫొటో ఎగ్జిబిషన్‌ను పెట్టి ప్రజల్లోకి బలమైన మెసేజ్‌ను తీసుకెళ్లాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.

కేసీఆర్ ఘనత చాటేలా

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అంటూ కాంగ్రెస్ బలంగా చెప్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర సాధనకు యావత్తు తెలంగా ణ ప్రజలను ఉద్యమంలోకి దూకించి సోనియాగాంధీని ఒప్పిం చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్పాలనుకుంటున్నది. టీఆర్ఎస్‌ను స్థాపించిన తర్వా త మంత్రి పదవులను, అధికారాన్ని ఉద్యమం కోసం త్యాగం చేసి రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్, గులాబీ లీడర్లు కృషి చేశా రని అప్పటి జ్ఞాపకాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల కు వివరించాలని భావిస్తున్నది. ఏ లక్ష్యం కోసం రాష్ట్రాన్ని తె చ్చుకున్నామో ఆ ఆకాంక్షలకు ఆచరణ రూపం ఇచ్చి పదేండ్లలో తెలంగాణను సంక్షేమ అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా కేసీఆర్ తన పాలనా చతురతతో తీర్చిదిద్దారనే అంశాన్ని కూడా నొక్కిచెప్పాలనుకుంటున్నది.

కాంగ్రెస్ ఇలా..

రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్‌ పాత్ర మాత్రమే కాక సబ్బండ వర్ణాలు ఉద్యమంలోకి దూకాయని, 1200 మంది విద్యార్థులు, యువత, తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగం చేశారన్న అంశాన్ని అధికారిక ఉత్సవాల ద్వారా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయదల్చుకున్నది. సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం పార్టీ నష్టపోయినా ప్రజల త్యాగాలు, ఆకాంక్షల మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నారని, ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోతే రాష్ట్రం ఏర్పడేదే కాదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. కానీ కేసీఆర్ పదేండ్ల పాటు క్రెడిట్ కొట్టేసి ప్రజల ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను చిన్నచూపు చూశారని పేర్కొంటున్నది.

తెలంగాణ భవన్‌ వేదికగా

కాంగ్రెస్ అధికారపూర్వకంగా జరుపుతున్న ఉత్సవాల తరహాలోనే కేసీఆర్‌ గొప్పదనాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. ప్రభుత్వం నిర్వహించే ప్రోగ్రామ్‌కు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోయినా బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ భవన్ వేదికగా జరుపుకునే ఉత్సవాలకు ఎలాంటి ఆంక్షలు లేని కారణంగా రెడీ అవుతున్నది. ఏ తీరులో జరపాలన్నదానిపై కేసీఆర్, కేటీఆర్, పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాల మేరకు త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

Similar News