CM రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది.. పొన్నాల సెటైర్

తెలంగాణలో తమకు అనుకూల వాతావరణం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు నటిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు.

Update: 2024-05-04 12:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తమకు అనుకూల వాతావరణం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు నటిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నామని ప్రజలను కాంగ్రెస్ నేతలు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గెలిస్తే, అధికారం వస్తేనే చేస్తాం అని అంటున్నారు తప్ప వచ్చేది మేమే కచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

అబద్ధాలు ఆడటంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని సెటైర్ వేశారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఆగష్టు 15వ తేదీలోపు వేస్తామని నమ్మబలికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తప్పించుకునే ధోరణిని ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికలు 7 రోజులు ఉండగా ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ టీవీల్లో, పేపర్లలో అడ్డగోలు ప్రకటనలు ఇస్తోందని అన్నారు. మరోవైపు రామమందిరం పేరుతో జనాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో బీజేపీ ఉందని విమర్శించారు. రామమందిరాన్నే బీజేపీ అస్త్రంగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలు తెచ్చి బీజేపీ దేశంలోని రైతుల పొట్ట కొడుతోందని అన్నారు. బీజేపీ పాలించిన పదేళ్లలోనే లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని ఆరోపించారు.

Read More..

ఏ సంకీర్ణంలో చేరుతావు.. KCRకు CM రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న

Tags:    

Similar News