చీలిక నివారణ కోసం ప్రయత్నాలు స్టార్ట్.. BRS ఓటుబ్యాంకు ఎటు వైపు?

లోక్‌సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు ఎక్కువ సీట్లు సాధిస్తామన్న ధీమాతో పాటు అంచనాకు తగినట్టు వస్తాయో రావోననే గుబులు కూడా ఉన్నది.

Update: 2024-05-09 02:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు ఎక్కువ సీట్లు సాధిస్తామన్న ధీమాతో పాటు అంచనాకు తగినట్టు వస్తాయో రావోననే గుబులు కూడా ఉన్నది. మిషన్-15 టార్గెట్ తరహాలోనే కనీసంగా 14 గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకంతో ఉన్నది. డబుల్ డిజిట్ ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నది. గతంకంటే ఒక సీటు ఎక్కువే వస్తుందని బీఆర్ఎస్ ఓపెన్‌గానే చెప్తున్నది. మూడు పార్టీలకూ వాటి లెక్కలు ఎలా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలహీనపడటంతో ఈసారి దాని ఓటుబ్యాంకు ఎటు వైపు? అనే చర్చ రాజకీయ నాయకుల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నది. అది కాంగ్రెస్‌వైపు మళ్లుతుందా? లేదా బీజేపీకి అనుకూలంగా ఉంటుందా? పోలింగ్ రోజున ఓటింగ్ ఏ స్థాయిలో ఉంటుంది? స్వతహాగా తాను గెలవలేకపోయినా ఏ పార్టీని గెలిపిస్తుంది..? ఇవీ ఇప్పుడు ముమ్మరంగా జరుగుతున్న చర్చలు.

బీఆర్ఎస్‌పై ఓటర్లలో రకరకాల చర్చలు..

కేంద్రంలో అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్, బీజేపీలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా కేంద్రంలో పవర్‌లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీకి ఓటు వేయడంపై ఓటర్లలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సంస్థాగతంగా ప్రతి గ్రామంలో యూనిట్లు ఉన్నాయని ఆ పార్టీ చెప్పుకున్నా ‘అసెంబ్లీ’ ఓటమితో నీరసపడ్డ పార్టీ కేడర్.. మరింత డీలా పడిపోయింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా మరికొద్దిమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు కేడర్‌ను గందరగోళంలోకి నెట్టింది. ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలలో చేరిపోయారు. పార్టీ సెక్రటరీ జనరల్‌ కే.కేశవరావు సైతం కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు చెప్పేశారు. జీహెచ్ఎంసీ మేయర్‌గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి (కేకే కుమార్తె) ఇప్పటికే చేరిపోయారు.

కాంగ్రెస్‌కు గులాబీ ఎమ్మెల్యేల పరోక్ష మద్దతు..!

దాదాపు పదేండ్లుగా బీఆర్ఎస్‌కు మద్దతు పలికిన వివిధ సెక్షన్ల ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారు. లోక్‌సభ ఎన్నికల్లో అది మరింత తీవ్రమై ఊహించని తీరులో ఫలితాలు వస్తాయనేది ఆ పార్టీ నేతల ధీమా. బీఆర్ఎస్‌ కేడర్ గ్రామస్థాయిలో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో అది ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. పార్టీలో లాంఛనంగా చేరకపోయినా చాలా మంది గులాబీ ఎమ్మెల్యేలు గ్రౌండ్‌లో కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు పలుకుతారనే చర్చలు సరేసరి. చాలా పార్లమెంటు సెగ్మెంట్లలో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తరహాలో ఉన్నా కొన్నిచోట్ల ముక్కోణపు పోటీ కూడా ఉన్నది. ఇలాంటి చోట్ల బీఆర్ఎస్ ఓట్లు ఏ పార్టీవైపు మళ్లుతాయన్నది ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

గులాబీ ఓటుబ్యాంకులో చీలిక..!

బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందనే అభిప్రాయం ఆ పార్టీ కేడర్‌లో ఆశించిన స్థాయిలో లేకపోయినా కేసీఆర్, కేటీఆర్ మాత్రం గతంలో గెలిచిన తొమ్మిది స్థానాలకంటే ఒకటి ఎక్కువే వస్తుందని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రస్థానం రాష్ట్రంలో కనుమరుగైపోయినట్టేనని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుందంటూ బీజేపీ నేతలు ఓపెన్‌గానే చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పడాల్సిన ఓట్లన్నీ కేంద్రంలో మళ్లీ మోడీ పవర్‌లోకి వస్తున్నారనే అంచనాతో తమకే పడతాయని కమలనాథులు నమ్ముతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతల అంచనాలు పరస్పరం భిన్నంగా ఉన్నా ఆ పార్టీ(బీఆర్ఎస్) ఓటు బ్యాంకులో చీలిక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ ఓటు బ్యాంకు ఏ పార్టీకి మేలు చేస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా జరుగుతున్న చర్చ.

కౌంటింగ్ వరకూ సస్పెన్సే..

‘అసెంబ్లీ’ ఎలక్షన్స్ తర్వాత పార్టీ నిర్మాణం దెబ్బతిన్నదని, ఇది లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే నిర్ధారణకు ఆ పార్టీ నేతలు వచ్చారు. నివారణ చర్యలపై పార్టీ దృష్టిపెట్టింది. ఎన్నికల్లో సొంతంగా గెలవలేకపోయినా ఇతర పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపుతుందన్న మాట కూడా ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరుగుతుంది? అది ఎలాంటి చేటు తెస్తుంది.? ఏ పార్టీకి కలిసొస్తుంది..? ఇలాంటి చర్చలే ఇప్పుడు కీలకంగా మారాయి. పోలింగ్ అయిపోయిన తర్వాత మూడు వారాల పాటు కౌంటింగ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది.

పోలింగ్ పర్సెంటేజీ, ఓట్లు పోలైన సరళి లాంటి అంశాల ఆధారంగా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు బహిర్గతం కావడానికి ముందే పార్టీలు ఒక స్పష్టతకు వచ్చే అవకాశమున్నది. పోలింగ్ పర్సెంటేజీ పెరిగితే ఏ పార్టీకి అనుకూలం..తగ్గితే ఏ పార్టీకి చిక్కులుంటాయి? ఇలాంటివి ఆయా పార్టీలు ఒక అంచనాకు రావడానికి దోహదపడనున్నాయి. అర్బన్ పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతున్నందున గెలుపోటములు కౌంటింగ్ వరకూ సస్పెన్స్‌గానే ఉండిపోతాయా..? లేక తక్కువ మార్జిన్‌తోనే అభ్యర్థులు బయటపడే అంచనాతో స్పష్టతకు రావడం కష్టమవుతుందా..? ఇది పోలింగ్ తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశమున్నది.

Similar News