పోల్ మేనేజ్ మెంట్‌పై BJP ఫోకస్.. ప్రతి బూత్‌లో ‘ప్లస్ 370’

డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ పోల్ మేనేజ్ మెంట్‌పై దృష్టిసారించింది.

Update: 2024-05-05 02:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ పోల్ మేనేజ్ మెంట్‌పై దృష్టిసారించింది. బూత్ స్థాయిలో మైక్రో లెవల్ అబ్జర్వేషన్ పెట్టనుంది. ఎవరు బీజేపీ మద్దతుదారులు, ఎవరు కాదు అనే అంశాన్ని ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగా పావులు కదిపేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి ఆపరేషన్ ను హస్తిన నుంచి చేపడుతున్నట్లు తెలిసింది. బూత్ స్థాయిలో నేతల పనితీరు, ప్రజల నుంచి పార్టీకి వస్తున్న ఆదరణ, ఎలాంటి అంశాలపై వ్యతిరేకత ఉందనే అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీయనున్నారు. రోజూ వారీగా గ్రౌండ్ రియాలిటీకి సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు హైకమాండ్ కు అందుతున్నాయి.

ప్రతి బూత్ లో 370 ఓట్లు అదనంగా..

బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించిన కమలం పార్టీ ప్రతి పోలింగ్ బూత్ లో అత్యధిక ఓట్లు సాధించాలని వ్యూహ రచన చేస్తున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ లో వచ్చిన ఓట్లకు అదనంగా 370 కి పైగా ఓట్లు రాబట్టాలనే వ్యూహంలో పావులు కదుపుతున్నది. అందులో భాగంగా ఆది, సోమ వారాల్లో పోలింగ్ బూత్ ల వారీగా సమావేశాలు నిర్వహించనున్నది. అలాగే ఈనెల 8, 9, 10 తేదీల్లో మూడో విడుత ఇంటింటి ప్రచారాన్ని చేపట్టనున్నారు.

అన్ని వర్గాల ప్రజలతో సమ్మేళనాలు..

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన బీజేపీ అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. ఎక్కడికక్కడ కులాలు, సంఘాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు చేపడుతున్నది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే పనిలో పార్టీ, అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో సిట్టింగులతోపాటు అదనంగా మరిన్ని సీట్లు పెరిగే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతుండగా, మరింత కష్టపడితే డబుల్ డిజిట్ ను టచ్ చేయడం పెద్ద సవాలేం కాదని శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే కమలం పార్టీ జాతీయ నాయకత్వం బూత్ స్థాయిలో మైక్రో లెవల్ అబ్జర్వేషన్ పెట్టింది. కాగా, పలు పార్లమెంట్ స్థానాల్లో కొందరు అభ్యర్థులు షోపుటప్ వరకే పరిమితమై.. ప్రచారాన్ని సీరియస్ గా చేపట్టడం లేదని హై కమాండ్ కు నివేదిక అందినట్లు తెలిసింది. సదరు అభ్యర్థులకు హైకమాండ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమని, లైట్ తీసుకోవద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది.

Similar News