తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం.. CM రేవంత్‌తో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌పై, ఆ

Update: 2024-05-18 12:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌పై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిపై మాటల తుటాలు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ స్వయంగా వెళ్లి ఆయనను కలిశారు. బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, రామ్‌రావ్ పటేల్ సీఎం రేవంత్ రెడ్డితో శనివారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని ఈ సందర్భంగా సీఎంను కోరారు.

కాగా, త్వరలోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని బీజేపీ అగ్రనేతలు కామెంట్లు చేస్తుండగా.. మరోవైపు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నేరుగా సచివాలయానికి వెళ్లి రేవంత్ రెడ్డితో భేటీ కావడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా బీజేపీ ఎల్పీ లీడర్ పగ్గాలు చేపట్టిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అన్నా, ఆ పార్టీ నేతలు అన్నా ఒంటి కాలిపై లేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా నిత్యం విమర్శలు చేయడంతో పాటు డైరెక్ట్‌గా ముఖ్యమంత్రికి సవాళ్లు విసిరారు.

ఈ నేపథ్యంలో ఇవాళ ఆయనే స్వయంగా వెళ్లి సచివాలయంలో సీఎంతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ భేటీపై బీజేపీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. కేవలం నియోజకవర్గాలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరడానికే తమ పార్టీ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారని.. అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేస్తున్నారు. ఏదైమైనా నిన్నటి వరకు విమర్శల కత్తులు దూసుకున్న నేతలు ఇవాళ భేటీ కావడం రాజకీయ వర్గాలలో కొత్త చర్చకు తెరలేచింది. 

Similar News