మంత్రి కేటీఆర్‌తో చర్చకు తాను సిద్ధం: BJP MLA Raghunandan Rao

కేంద్రం, ప్రధాని మోడీపై ఒక క్రమపద్ధతిలో బీఆర్ఎస్ దాడి చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

Update: 2023-02-07 07:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం, ప్రధాని మోడీపై ఒక క్రమపద్ధతిలో బీఆర్ఎస్ దాడి చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీఐఆర్‌పై మంత్రి కేటీఆర్‌తో చర్చకు తాను సిద్ధమని, మంత్రి సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. ఐటీఐఆర్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం దమ్ముంటే శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేదన్నారు. ఐటీఐఆర్‌కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులనే కేంద్రం మంజూరు చేసిందని నొక్కిచెప్పారు. డీపీఆర్ సమర్పించుకుంటే కేంద్రం నిధులు ఎలా కేటాయిస్తోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో హైవేలు, రైల్వేలు అభివృద్ధికి కేంద్రం కంకణం కట్టుకుందని వెల్లడించారు.

కానీ ఐటీఐఆర్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని అనవసరంగా బద్నాం చేస్తోందని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. ఐటీఐఆర్ అంటే భవనాలు కాదని, పెట్టుబడులు ఆకర్షించటానికి రోడ్లు, మెట్రో రైలును అభివృద్ధి చేయడమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చురకలంటించారు. ఐటీఐఆర్‌ను రెండు విడుతల్లో అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇమ్లీమన్ బస్ స్టాప్ నుంచి ఫలక్ నూమా వరకు మెట్రో పనులు జరగకపోవడానికి కారణం ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల నేతలేనని విమర్శలు చేశారు. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఏ ఒక్క పనిని కూడా చేపట్టలేదని ఎమ్మెల్యే రఘునందనరావు ధ్వజమెత్తారు.

Tags:    

Similar News