జేపీఎస్‌లకు అండగా నిలవండి.. బీజేపీ శ్రేణులతో బండి సంజయ్ టెలీకాన్ఫ్‌రెన్స్

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్) రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులన్నీ అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Update: 2023-05-09 06:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్) రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులన్నీ అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా సమ్మె చేస్తున్న జేపీఎస్, ఓపీఎస్‌ల ఇళ్ల వద్దకు, సమ్మె చేస్తున్న ప్రాంతాలకు వెళ్లి పూర్తిస్థాయిలో సంఘీభావం తెలపాలని కోరారు. అంతేగాకుండా జేపీఎస్ ల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పక్షాన క్షేత్ర స్థాయిలో ఎక్కడికక్కడ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వారి సమ్మెకు మద్దతు ఇతర శాఖల ఉద్యోగులను భాగస్వాములను చేసి జేపీఎస్‌లు ఒంటరి కాదనే సంకేతాలను పంపాలని కోరారు. మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇంఛార్జీలు, అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరైన ఈ టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్ జేపీఎస్‌లకు సంఘీభావం తెలిపే అంశంతోపాటు ఈ నెల 11న సంగారెడ్డిలో నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’, 14న కరీంనగర్ లో నిర్వహించే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ అంశాలపైనా దిశానిర్దేశం చేశారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నారని, వారు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదేనన్నారు. కష్టపడి పరీక్ష రాసి సెలెక్టై ఉద్యోగాల్లో చేరిన జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. జేపీఎస్‌లు అన్నీ భరించి 4 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ను పూర్తి చేసిన తర్వాత కూడా రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. నేడు గ్రామాల్లో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే.. గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చాయంటే కారణం జూనియర్ పంచాయతీ కార్యదర్శులేనని స్పష్టంచేశారు. మంగళవారం సాయంత్రంలోపు విధుల్లో చేరకుంటే సమ్మె చేస్తున్న జేపీఎస్ లను తొలగిస్తామని హెచ్చరించిందన్నారు. జేపీఎస్‌లను కేసీఆర్ ప్రభుత్వం తొలగించేందుకు కుట్ర చేస్తోందన్నారు. పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇంళ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతాం.. అరెస్ట్ చేస్తాం.. జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్థాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని, బీజేపీ శ్రేణులంత జేపీఎస్ ల ఇళ్లకు వెళ్లాలని, సమ్మెకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని, అండగా బీజేపీ ఉందనే సంకేతాలను పంపాలన్నారు. అందులో భాగంగా జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పక్షాన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటుదాం

అట్లాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యుడైన ఐటీశాఖ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలనే ప్రధాన డిమాండ్ లో ఈ నెల 11న సంగారెడ్డిలో నిర్వహించబోయే ‘‘నిరుద్యోగ మార్చ్’’లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 14న కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించబోతున్నామని, భజరంగ్ దళ్ ను నిషేధిస్తామంటూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత హిందూ ధర్మరక్షకులంతా ఏకమవుతున్నారని తెలిపారు. తెలంగాణలోనూ హిందువుల సత్తా తెలిపేందుకు.. తెలంగాణ వ్యాప్తంగా హిందుత్వ వాతావరణం వెల్లివిరిసేలా ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను నిర్వహించబోతున్నామన్నారు. దాదాపు లక్ష మందికిపైగా ఈ యాత్రకు హాజరయ్యే అవకాశముందన్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీల్లేకుండా హిందూ ఏక్తా యాత్ర పేరుతో నిర్వహించబోతున్నామని స్పష్టంచేశారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ కూడా హాజరవుతారన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తతోపాటు, హిందూ ధర్మ రక్షకులంతా ఈ యాత్రలో పాల్గొని హిందూ సంఘటిత శక్తిని చాటాలని కోరారు.

Tags:    

Similar News