ఇంటర్ బోర్డులో మళ్లీ అఫిలియేషన్ల లొల్లి.. ప్రైవేట్ కాలేజీల గుర్తింపుపై కన్ఫ్యూజన్

ఇంటర్ బోర్డులో అఫిలియేషన్ల లొల్లి మళ్లీ మొదలైంది.

Update: 2024-05-27 02:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ బోర్డులో అఫిలియేషన్ల లొల్లి మళ్లీ మొదలైంది. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీతో ఉన్న ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. దీనిపై స్పష్టత రాకున్నా ఇప్పటికే పలు యాజమాన్యాలు అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టేశాయి. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారనుంది. ఫస్టియర్ విద్యార్థుల కంటే సెకండియర్ చదివే స్టూడెంట్స్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. పర్మిషన్స్ రద్దు చేయకుండా ఉండాలంటే అన్ని నిబంధనల ప్రకారం కాలేజీని నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే సెకండియర్ విద్యార్థులు కాలేజీ మారాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో మిక్స్‌డ్ ఆక్యుపెన్సీల్లో కొనసాగుతున్న కొన్ని కాలేజీలు రెండేండ్ల నుంచి ప్రత్యేక అనుమతితో కొనసాగుతున్నాయి.

420కి పైగా కాలేజీలను పక్కనపెట్టే చాన్స్

2024–25 విద్యాసంవత్సరానికి ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్ కోసం ఇంటర్ బోర్డు ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. కాగా ఈ నెల 5వ తేదీ వరకు రూ.20 వేల జరిమానాతో దరఖాస్తు చేసుకునేందుకు బోర్డు చాన్స్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,582 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. ఇందులో దాదాపు 420కి పైగా కాలేజీలు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ ఉన్న భవనాల్లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్ బోర్డు ఆఫీసర్లు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో ఆయా కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వకుండా పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయంపై సందిగ్ధం

నిబంధనలు పాటించని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు చెక్ పెట్టాలని చూసినా అకడమిక్ ఇయర్ మధ్యలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని విన్నవించుకోవడంతో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గత బీఆర్ఎస్ సర్కార్ రెండేండ్లు కొనసాగించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే అదే ధీమాతో ఏమవుతుందిలే అని భావించి 2024-25 విద్యాసంవత్సరానికి కూడా పలు ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లను మొదలుపెట్టేశాయి. కానీ ఈసారి ప్రభుత్వం మారడంతో మిక్స్ డ్ ఆక్యుపెన్సీల్లో కొనసాగుతున్న కాలేజీలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సందిగ్ధంలో ఉంది.

మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో 2023–24 ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులతో పాటు పేరెంట్స్ వద్ద నుంచి కూడా ముందుగానే అండర్ టేకింగ్ తీసుకోవాలని అప్పటి ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ ఆయా యాజమాన్యాలకు తెలిపారు. 2024–25 అకడమిక్ ఇయర్‌లో తాము చేరే కాలేజీకి గుర్తింపు ఉన్నా లేకున్నా.. ఇబ్బంది లేదని, తమ ఇష్టపూర్వకంగానే కాలేజీలో చేరుతున్నట్టు వారి నుంచి రాతపూర్వకంగా లేఖలు సేకరించి పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆయా కాలేజీల్లో ఫస్టియర్ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. గుర్తింపు లేని కాలేజీల్లో సెకండియర్ ఎలా చదవాలనే అంశం వారి ఆందోళనకు కారణమవుతోంది. మరి మిక్స్ డ్ ఆక్యుపెన్సీ కలిగి ఉన్న యాజమాన్యాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.

Similar News