పెండింగ్ దరఖాస్తులను వారం లోగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ధరణి, ప్రజావాణి పెండింగ్

Update: 2024-05-22 12:25 GMT

దిశ,ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ధరణి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వారం లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధరణి, ప్రజావాణి లో ఉన్న పెండింగ్ దరఖాస్తుల పై సమావేశం నిర్వహించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను, సమస్యలను పరిష్కరించాలని, అందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్ఫెక్షన్ చేసి ఆన్లైన్ లోనే కాకుండా ఫైల్స్ రూపంలో కూడా నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు.

రిపోర్టులను పరిశీలించి సంబంధిత నివేదికలతో పూర్తిస్థాయిలో కలెక్టరేట్ కు సమర్పించాలని అన్నారు. ఈ క్రమంలో మండలాల వారీగా తహాసీల్దార్ లను వారి లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తుల పై సమీక్షించి త్వరగా పూర్తి చేయాలని, జూన్ రెండో వారంలో ప్రజావాణి ప్రారంభం అవుతుందని, ఆ లోపు ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ శ్యామల దేవి,ఆర్డీవో లు వినోద్ కుమార్, జివాకర్ రెడ్డి, తహసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Similar News