నిర్మల్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. ఏళ్ల నాటి కల సాకారం..

జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. నిర్మల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందు పడింది.

Update: 2022-08-10 12:37 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. నిర్మల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందు పడింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి అనుబంధ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిపాలన అనుమతులు జారీ చేస్తూ జీవోను విడుదల చేసింది. దీంతో కళాశాల ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ వేగంగా సాగనుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా సముదాయంలో నూతన వైద్య కళాశాల కొలువు ధీరనుంది. 100 ఎంబీబీఎస్ సీట్లతో 166 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మల్‌లో వైద్య కళాశాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మంజూరైన ఈ కళాశాల మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో (జిల్లా ఆసుప‌త్రి 5 ఎక‌రాలు క‌లుపుకుని) ఏర్పాటు కానుంది. ఈ స్థలంలోని వైద్య కళాశాల భవన సముదాయం, వసతి గృహం, ప్రత్యేక వార్డులు, బ్లాకులను నిర్మించనున్నారు. వైద్య కళాశాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీతో ఇక నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

ఆవిర్భావం తర్వాత నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో వైద్య సదుపాయాల కల్పన పెరుగుతూ వస్తుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇప్పటికే అనేక రకాల ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. రూ. 40 కోట్ల అంచ‌నా వ్యయంతో 5 ఎక‌రాల విస్తీర్ణంలో 250 ప‌డ‌క‌ల జిల్లా ఆసుప‌త్రి నిర్మాణం కొన‌సాగుతుంది. ప‌ట్టణంలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్, రేడియాల‌జీ ల్యాబ్, పాలియేటివ్ కేర్ విభాగాలు రోగులకు సేవలు అందిస్తున్నాయి. నిర్మల్ జిల్లా ప్రాంతాల్లోని పేదోడి వైద్యానికి ఆసుపత్రి భరోసా ఇస్తుంది.

నిర్మల్లో సంబురాలు..

మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో ఏళ్ల మెడికల్ కళాశాల ఏర్పాటు కల సాకారం కావడంతో నిర్మల్ జిల్లా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. నిర్మల్ జిల్లాకు మెడిక‌ల్ కాలేజ్‌ను మంజూరు చేస్తూ ప‌రిపాల‌న అనుమ‌తులు రాడ‌వంతో ప‌ట్టణంలో ఘనంగా సంబరాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సీఎం కేసీఅర్, మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టపాసులు పేల్చి జేజేలు పలికారు.

అనంత‌రం మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా వైద్య కళాశాల కోసం ఎదురుచూస్తున్నారని, వారి కోరిక‌ను సీఎం కేసీఆర్‌ నేరవేర్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు జిల్లా ప్రజల తరపున‌ ధన్యవాదాలు తెలిపారు. వైద్య కళాశాలతో నిర్మల్ అద్భుతమైన వైద్య విజ్ఞాన కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు కార్పొరేట్‌ వైద్యసేవలు మరింత దగ్గర కానున్నాయన్నారు. స్థానికంగానే ఖరీదైన వైద్యం ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. నిర్మల్ జిల్లా అభివృద్ధిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నామని, వైద్య కళాశాల మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. త్వరలో నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు కానుందని తెలిపారు. నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కాలేదేదని, కాదు అని కొంత మంది అవగాహనరాహిత్యంతో అవాకులు చెవాకులు పేలారని, ఇప్పుడు వారు ఏం సమాధానం చెప్పుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వక్రబుద్ధితో మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిదులు

నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజ్ రావడానికి విశేష కృషి చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిదులు కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో పటాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వదలకుండా ఎంతో పట్టుదలతో మెడికల్ కాలేజ్ మంజూరు చేయించి నిర్మల్ జిల్లాను మెడికల్ హబ్‌గా మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని వారు కితాబిచ్చారు.


Similar News