రైతులని ఆదుకోవాలి : తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల ధర్నా

ఆరుగాలం కష్టపడి పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో వడగండ్ల వానతో నేలమట్టమైన వరి పంటను చూసి రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Update: 2024-05-08 12:35 GMT

దిశ, వేమనపల్లి : ఆరుగాలం కష్టపడి పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో వడగండ్ల వానతో నేలమట్టమైన వరి పంటను చూసి రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతులను ఆదుకునేవారు లేరని, ప్రభుత్వం కూడా నష్టపరిహారం పై అంచనా కోసం అధికారులను పంపలేదని బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై వరికర్రలతో ధర్నా చేసి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం కురిసిన వడగండ్ల వానకు యాసంగిలో వేసిన వరి పంట నేలమట్టమైంది. మరికొన్నిచోట్ల వరి ధాన్యం నిల్వచేసిన చోట నీరు నిలిచి ధాన్యం నీటిలో తడిసిపోయింది. కొన్నిచోట్ల ఇండ్లపై రేకులు ఈదురుగాలులకు లేచిపోయాయి.

     ఇంత నష్టం జరిగినా రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు ఎవరూ రాకపోవడంతో రైతన్నలు ఆక్రోశించి తమలను ఆదుకోవాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి రికార్డు అసిస్టెంట్ హుస్సేన్ కు వినతిపత్రాన్ని అందజేశారు. పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాల్సిన అధికారులు ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులగోడు పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంలో ప్రజాప్రతినిధులు, ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నం కావడంతో రైతుల కష్టాన్ని గుర్తించే నాథులే కరువయ్యారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్​ చేశారు. 

Similar News