ఒకే వ్యక్తి పేరుపై 1,389 ఎకరాలు.. సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నెమలిపురి గ్రామం.. శివారులోని సర్వే నంబర్ 318లో 1,389.36 ఎకరాల భూమి ఉన్నది.

Update: 2024-05-24 03:30 GMT

దిశ, హుజూర్ నగర్/చింతల పాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నెమలిపురి గ్రామం.. శివారులోని సర్వే నంబర్ 318లో 1,389.36 ఎకరాల భూమి ఉన్నది. అయితే భూప్రక్షాళన తర్వాత ధరణి పోర్టల్‌లో నమోదు చేసే సమయంలో జరిగిన తప్పిదంతో ఆ భూమంతా సర్వే నంబర్ 318/ఆ లో ఖాతా నంబర్ 193లో గుడి మల్కాపురం గ్రామానికి చెందిన గల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరు మీద ఎంటర్ అయింది. దీన్ని అధికారులు గుర్తించినా.. సరిచేసే ఆప్షన్ లేక అలాగే ఉంచారు. అయితే డిజిటల్ సైన్ చేయకుండా.. ఆ భూమి ఇతరుల పేరుపై మార్చకుండా నిలిపివేశారు. ఇప్పటికీ ధరణి పోర్టల్‌లో ఆ భూమి గల్లా శ్రీనివాస్ రావు పేరుపైనే చూపిస్తుండడం గమనార్హం.

రెవెన్యూ, ఫారెస్ట్ రికార్డుల్లోనూ..

నెమలిపురి శివారులోని సర్వే నంబర్ 318లో 1389.36 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో మొదట్లో శ్రీపరస రంగరాజ భట్టాచార్య పేరుపై నమోదై ఉన్నది. అయితే ఈ భూమిని నిజాం కాలంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. ఆ సమయంలో ఆ భూమిని రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించకపోవడంతో సమస్య ఏర్పడింది. రెవెన్యూ రికార్డుల్లో 2014 వరకు ఈ భూమి రంగరాజ భట్టాచార్య పేరుపైనే కొనసాగింది.

దీంతో కొందరు లీడర్లు రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని భట్టాచార్య వారసుల ద్వారా భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ లీడర్లతో పాటు భట్టాచార్య వారసులు హైకోర్టుకు వెళ్లారు. మొత్తం భూమి తమదేనని వాదించారు. ఫారెస్టు అధికారులు సైతం కోర్టును ఆశ్రయించారు. దీంతో సర్వే నంబర్ 318లోని 1389.36 ఎకరాల భూమి అంతా రెవెన్యూ వారు అటవీశాఖకు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని ఫారెస్టు రేంజ్ అధికారి లక్ష్మీపతిరావు తెలిపారు.

హద్దుల్లోనూ వివాదం

నెమలిపురి శివారులోని సర్వే నంబర్ 318, వదినేపల్లి శివారులోని సర్వే నంబర్ 52 పక్కపక్కనే ఉన్నాయి. 52 సర్వే నంబర్‌లో 635 ఎకరాలు భూమి ఉంది. అందులో 114 ఎకరాలు పులిచింతల ముంపు కింద పోయింది. 146 ఎకరాల సీలింగ్ భూమి ఉండగా.. అందులో 93 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మిగతా ఖాళీగా ఉన్న 375 ఎకరాల భూమి రెవెన్యూదని అధికారులు కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు మాత్రం 29 ఎకరాల 30 గుంటల భూమి మాత్రమే రెవెన్యూకు చెందిందని తీర్పు ఇచ్చినట్లు సమాచారం. అయితే సర్వే నంబర్ 318, సర్వే నంబర్ 52ల మధ్య హద్దులు లేకపోవడంతో రెవెన్యూ, అటవీశాఖ భూముల గుర్తింపు సమస్యగా మారింది.

గతంలో నకిలీ పాస్‌బుక్‌ల కలకలం

నెమలిపురి శివారులో సర్వే నంబర్ 318లోని 1389.36 ఎకరాలకు సంబంధించి గతంలో నకిలీ పాస్‌బుక్‌లు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. ఈ భూమికి సంబంధించి కొందరు 248 మంది రైతుల పేర్లతో నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. పంట రుణాల కోసం బ్యాంకుల్లో అప్లయ్ చేసుకోగా.. ఈ విషయం బయటపడింది.

నా పేరుపైకి ఎలా వచ్చిందో తెలియదు

సర్వే నంబర్ 318లో గతంలో మా నాన్న యోగయ్య కొంత భూమి కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. భూ ప్రక్షాళన సమయంలో ఆ ఆధారాలను రెవెన్యూ వారికి అప్పగించాం. అయితే ఆ సర్వే నంబర్లోని భూమి అంతా నా పేరుపైకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. మాకు సర్వే నంబర్ 319లోనూ 20 ఎకరాల భూమి ఉన్నది. ముగ్గురు అన్నదమ్ములం పంచుకుకున్నాం. ఇప్పుడు నా దగ్గర ఎకరం 20 గుంటల భూమి మాత్రమే ఉన్నది.

- గల్లా శ్రీనివాస రావు

Similar News