సచిన్ సంచలనం.. ఆసియా రికార్డు నమోదు

వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత పారా షాట్‌పుటర్ సచిన్ సర్జేరావు ఖిలారీ సత్తాచాటాడు.

Update: 2024-05-22 12:31 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత పారా షాట్‌పుటర్ సచిన్ సర్జేరావు ఖిలారీ సత్తాచాటాడు. జపాన్‌లో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 కేటగిరీలో చాంపియన్‌గా నిలిచాడు. ఆరో ప్రయత్నంలో అతను 16.30 మీటర్ల ప్రదర్శనతో కొత్త ఆసియా రికార్డును నెలకొల్పడంతోపాటు స్వర్ణం సాధించాడు. ప్రస్తుత టోర్నీలో భారత్‌కు ఇది 5వ స్వర్ణం. గతేడాది కూడా ఈ టోర్నీలో సచిన్ ఆసియా రికార్డుతోనే గోల్డ్ మెడల్ సాధించడం గమనార్హం. అప్పుడు 16.21 మీటర్ల ప్రదర్శన చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు.

మరోవైపు, పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 కేటగిరీలో మరో భారత అథ్లెట్ ధరంబీర్ కూడా ఆసియా రికార్డును నెలకొల్పాడు. 33.61 మీటర్ల ప్రదర్శనతో కాంస్యం గెలుచుకున్నాడు. బుధవారం రెండు పతకాలు చేరడంతో భారత్ గతేడాది ప్రదర్శనను అధిగమించింది. గత ఎడిషన్‌లో భారత్ 10 పతకాలు సాధించగా.. ప్రస్తుత టోర్నీలో 12 పతకాలు చేరాయి. అందులో 5 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. మెడల్స్ టేబుల్‌లో చైనా(48), బ్రెజిల్(30) తర్వాత భారత్ మూడో స్థానంలో ఉన్నది. 

Tags:    

Similar News