మలేషియా మాస్టర్స్‌లో సింధు జోరు.. క్వార్టర్స్‌లో టాప్ సీడ్‌కు షాక్

మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది.

Update: 2024-05-24 14:50 GMT

దిశ, స్పోర్ట్స్ : కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది.సంచలన విజయాలు సాధిస్తున్న ఈ భారత స్టార్ తాజాగా సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 21-13, 14-21, 21-12 తేడాతో టాప్ సీడ్, వరల్డ్ నం.6 హాన్ యూ(చైనా)ను ఓడించింది.

55 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు శుభారంభం చేసింది. అలవోకగా తొలి గేమ్‌ను నెగ్గింది. అయితే, రెండో గేమ్‌లో బలంగా పుంజుకున్న చైనా క్రీడాకారిణి దూకుడుగా ఆడింది. ఒక దశలో ఆమె 15-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సమయంలో ప్రతిదాడికి దిగిన సింధు వరుస పాయింట్లు నెగ్గి 17-13తో ప్రత్యర్థికి చేరువైంది. అయితే, చైనా షట్లరు మరో నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌ రసవత్తరంగా సాగుతుందని అంతా భావించగా.. సింధు మాత్రం గేమ్‌ను ఏకపక్షం చేసింది. సింధు ఆడిన షాట్లకు ప్రత్యర్థి వద్దే సమాధానం లేకపోయింది.

శనివారం జరిగే సెమీస్‌లో థాయిలాండ్ క్రీడాకారిణి బుసానన్ ఒంగ్‌బుమ్రాంగ్ఫాన్‌తో సింధు తలపడనుంది. మరోవైపు, యువ క్రీడాకారిణి అష్మిత చాలిహా పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో 6వ సీడ్, చైనాకు చెందిన జాంగ్ యి మాన్‌‌ చేతిలో 21-10, 21-15 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 

Tags:    

Similar News