ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్.. వైస్ కెప్టెన్‌గా టీమ్ ఇండియా ఆల్‌రౌండర్

Update: 2023-03-16 14:37 GMT

న్యూఢిల్లీ: అందరూ భావించినట్టే ఐపీఎల్-16 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నడిపించనున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈ సీజన్‌కు దూరమైన విషయం తెలిసిందే. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఈ సీజన్‌లో జట్టు పగ్గాలను వార్నర్‌కు అప్పగించింది. ఇటీవల సంచలన ప్రదర్శనతో సత్తాచాటుతున్న టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్సీగా నియమించింది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వార్నర్‌కు సుదీర్ఘ అనుభవం ఉన్నది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తొలిసారిగా విజేతగా నిలబెట్టింది వార్నరే.

అలాగే, లీగ్‌లో 162 మ్యాచ్‌లు ఆడిన అతను 5,881 పరుగులు చేశాడు. అలాగే, దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరాడు. దాదా బీసీసీఐ ప్రెసిడెంట్‌ కాకముందు ఢిల్లీ జట్టుకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఫ్రాంచైజీ దాదాకు తిరిగి అదే హోదాను అప్పగించింది. ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడటంతో ఐపీఎల్-16ను మొదలుపెట్టనుంది.

Tags:    

Similar News