నిఖత్ జరీన్ అదరహో.. ఒలింపిక్స్‌ పతక ఆశలు రెట్టింపు

వరల్డ్ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కేజీల కేటగిరీలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Update: 2024-05-18 13:43 GMT

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కేజీల కేటగిరీలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ విశ్వక్రీడలకు ముందు కజకిస్తాన్ వేదికగా జరిగిన ఎలోర్డా కప్ టోర్నీలో ఆమె అదరగొట్టింది. 52 కేజీల కేటగిరీలో చాంపియన్‌గా నిలిచి ఒలింపిక్స్‌లో పతక ఆశలు మరింత పెంచింది. శనివారం జరిగిన ఫైనల్ బౌట్‌లో నిఖత్ 5-0 తేడాతో కజకిస్తాన్‌కు చెందిన జాజిరా ఉరక్‌బయేవా‌ను మట్టికరిపించింది. టోర్నీ ఆద్యంతం దూకుడు కనబర్చిన ఆమె ఫైనల్‌లోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణం దక్కించుకుంది. మరో బాక్సర్ మీనాక్షి సైతం బంగారు పతకాన్ని గెలుచుకుంది. 48 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్‌లో మీనాక్షి 4-1 తేడాతో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ రహ్మోనేవా సైదాహోన్‌ను ఓడించింది. అనామిక(50 కేజీలు), మనీషా(60 కేజీలు) ఫైనల్‌లో ఓడి రజత పతకాలతో సరిపెట్టారు. ఈ టోర్నీని భారత్ 12 పతకాలతో ముగించింది. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలతోపాటు 8 కాంస్య పతకాలు ఉన్నాయి. 

Tags:    

Similar News