బీసీసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టుల భర్తీకి ఎన్నికల అధికారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

Update: 2022-09-25 13:11 GMT

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టుల భర్తీకి ఎన్నికల అధికారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ మేరకు శనివారం బీసీసీఐ రాష్ట్ర సంఘాలకు ఏడు పేజీలతో కూడిన లేఖను పంపింది. ఇందులో రాష్ట్ర యూనిట్లు తమ సభ్యులను నామినేట్ చేయాలని పేర్కొంది.

సభ్యులు తమ ప్రతినిధిని నామినేట్ చేసి అక్టోబర్ 4 వరకు దరఖాస్తును ఫైల్ చేయాలి. అక్టోబర్ 5న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ విడుదల, అక్టోబర్ 6, 7 తేదీల్లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌లోని పేర్లపై అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 10న తుది జాబితా, అక్టోబర్ 11, 12వ తేదీల్లో నామినేషన్ దాఖలు, అక్టోబర్ 13న దరఖాస్తుల పరిశీలన, అక్టోబర్ 14న నామినేషన్ ఉపసంహరణ, ముంబైలో అక్టోబర్ 18న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఎన్నికలు జరగనున్నాయి.

అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా, ఇటీవల సుప్రీంకోర్టు బీసీసీఐ కూలింగ్ పీరియడ్‌ను సవరించింది. దీంతో అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, సెక్రటరీగా జై షా కొనసాగనున్నారు. కానీ గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవిని, జై షా బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Similar News