ఆర్చరీ వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు జ్యోతి జోడీ

Update: 2024-05-24 19:49 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్‌ స్టేజ్-2లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరో గోల్డ్ మెడల్‌కు చేరువైంది. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన కాంపౌండ్ మహిళల టీమ్‌లో ఆమె సభ్యురాలు. తాజాగా కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ ప్రియాన్షుతో కలిసి ఆమె టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో జ్యోతి జోడీ 158-157 తేడాతో సౌత్ కొరియాకు చెందిన హన్ సెంగ్యోన్-యాంగ్ జేవాన్ జంటను ఓడించింది.

వరుసగా తొలి రెండు రౌండ్లలో 38-39, 39-40 తేడాతో నెగ్గిన జ్యోతి, ప్రియాన్షు.. మూడో రౌండ్‌లో 40-40తో సమంగా నిలిచారు. ఇక, నాలుగో రౌండ్‌లో 40-39తో ప్రత్యర్థి ద్వయం పైచేయి సాధించినా మొత్తం స్కోరులో ఒక్క పాయింట్ తేడాతో జ్యోతి జోడీ ముందడుగు వేసింది. శనివారం జరిగే ఫైనల్‌లో భారత జంట అమెరికాతో తలపడనుంది. గత నెలలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్-1లో అభిషేక్ వర్మతో కలిసి జ్యోతి విజేతగా నిలిచింది. మరోవైపు, భారత అగ్రశ్రేణి ఆర్చర్ దీపిక కుమారి మహిళల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో దీపిక 6-4 తేడాతో తుర్కియే క్రీడాకారిణి ఎలిఫ్ బెర్రా గొక్కిర్‌పై విజయం సాధించింది. ఆదివారం జరిగే సెమీస్‌లో వరల్డ్ నం.2 లిమ్ సిహ్యోన్(సౌత్ కొరియా)ను ఎదుర్కోనుంది. 

Tags:    

Similar News