మమ్మల్ని బల్దియాలోనే కొనసాగించాలి.. కార్మికుల ఆత్మహత్యాయత్నం

దిశ, సిటీ బ్యూరో: తమను సీవరేజీ కార్మికులుగా బల్దియాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు శివారు ప్రాంతాల సీవరేజీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్ది సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ వర్కర్లుగా పని చేస్తున్న తమను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జలమండలి కార్మికులుగా బదలాయించాలని ఆదేశిస్తూ మున్సిపల్ మంత్రి కేటీఆర్ జారీ చేసిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు శనివారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బల్దియాలో తమ శ్రమకు […]

Update: 2021-07-31 09:12 GMT

దిశ, సిటీ బ్యూరో: తమను సీవరేజీ కార్మికులుగా బల్దియాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు శివారు ప్రాంతాల సీవరేజీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్ది సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ వర్కర్లుగా పని చేస్తున్న తమను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జలమండలి కార్మికులుగా బదలాయించాలని ఆదేశిస్తూ మున్సిపల్ మంత్రి కేటీఆర్ జారీ చేసిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు శనివారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బల్దియాలో తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని తీసుకుంటూ ఆనందంగా ఉన్నామని, మళ్లీ జలమండలిలోకి మార్చి, తమ శ్రమను దోచుకోవద్దంటూ వనస్థలిపురానికి చెందిన సిద్దూ(28), సరూర్ నగర్‌కు చెందిన ఉదయ్(23)లు కిరోసిన్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన సాటి కార్మికులు అడ్డుకుని వారిపై నీళ్లు పోశారు.

ఈ సందర్భంగా బాధిత కార్మికులు సిద్దూ, ఉదయ్ మాట్లాడుతూ… గతంలో తాము జలమండలి పరిధిలో డ్రైనేజీల్లోకి దిగి పని చేస్తున్నపుడు కాంట్రాక్టర్లు తమకు కేవలం రూ.8 వేల వేతనం మాత్రమే చెల్లించేవారని, ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయలేదని, జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిన తర్వాత తమకు జీతం రూ.14,500 వస్తోందని, దీనికి తోడు ఈఎస్ఐ, పీఎఫ్ కూడా వర్తింపజేస్తున్నారని వివరించారు. మళ్లీ తమను జలమండలి పరిధిలోకి తీసుకుంటే తమ శ్రమ దోపిడీకి గురవుతుందన్న విషయాన్ని గుర్తించి మంత్రి కేటీఆర్ వెంటనే తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో వరుస ఆత్మహత్యలకు పాల్పడుతామని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మజ్దూర్ మోర్చా సిటీ చైర్మన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్(జీహెచ్ఎంఈయూ) అధ్యక్షుడు ఊదరి గోపాల్ హుటాహుటిన అక్కడకు చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించారు.

ఆత్మహత్యలొద్దు.. మేమున్నాం : TGHMEU అధ్యక్షుడు ఊదరి గోపాల్

ఏ సమస్య వచ్చినా కార్మికులు ధైర్యంగా పోరాడుతూ ముందుకు సాగాలే తప్పా, ఆత్మహత్యలకు పాల్పడొద్దని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు, మజ్దూర్ మోర్చా సిటీ చైర్మన్ ఊదరి గోపాల్ అన్నారు. శివారు సీవరేజీ కార్మికులకు తాము, తమ యూనియన్ అండగా ఉంటూ కార్మికుల తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గానీ, జలమండలి ఎండీ గానీ వీరికి రూ.14 వేల వేతనం, అలాగే ఈఎస్ఐ, పీఎఫ్‌లను అమలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చి కార్మికుల్లో భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని, న్యాయపోరాటాన్ని చేసేందుకు కార్యచరణ సిద్ధం చేస్తామని గోపాల్ వెల్లడించారు.

Tags:    

Similar News