స్టాక్ మార్కెట్లకు ఆర్‌బీఐ జోష్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ లాభాలను దక్కించుకున్నాయి. శుక్రవారం ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లలో మార్పులుండవని ప్రకటించడంతో సూచీలు దూసుకెళ్లాయి. ప్రధానంగా ఆర్థికవ్యవస్థ వృద్ధి పునరుద్ధరణకు అవసరమైనంత వరకు వడ్డీ రేట్లను సర్దుబాటు ధోరణిలోనే కొనసాగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించడం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు గణనీయంగా పుంజుకున్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను మదుపర్లలో ఉత్సాహాన్ని నింపాయి. […]

Update: 2021-10-08 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ లాభాలను దక్కించుకున్నాయి. శుక్రవారం ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లలో మార్పులుండవని ప్రకటించడంతో సూచీలు దూసుకెళ్లాయి. ప్రధానంగా ఆర్థికవ్యవస్థ వృద్ధి పునరుద్ధరణకు అవసరమైనంత వరకు వడ్డీ రేట్లను సర్దుబాటు ధోరణిలోనే కొనసాగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించడం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు గణనీయంగా పుంజుకున్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను మదుపర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే నిఫ్టీ50 రికార్డు స్థాయిల వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ శుక్రవారం ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరువగా కదలాడింది.

ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో ఆర్‌బీఐ పాలసీ వివరాలు వెలువడటంతో నిఫ్టీ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలైన 17,947 వద్ద ఎగసింది. అయితే, మిడ్-సెషన్ తర్వాత కొంత నెమ్మదించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 381.23 పాయింట్లు ఎగసి 60,059 వద్ద క్లోజయింది. నిఫ్టీ 104.85 పాయింట్లు పెరిగి 17,895 వద్ద ముగిసింది. నిఫ్టీలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలకు ముందు మెరుగ్గా ర్యాలీ చేయడంతో ఐటీ ఇండెక్స్ పుంజుకుంది.

పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, మెటల్ రంగాలు 1.8 శాతం వరకు బలపడ్డాయి. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. హిందూస్తాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, మారుతీ సుజుకి, డా రెడ్డీస్, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.01 వద్ద ఉంది.

Tags:    

Similar News