మీ సేవలకు సలాం
నగరం నిద్రపోతున్న వేళ వారు మేల్కొంటారు. అర్ధరాత్రి ఆటోలో, లేకుంటే నడుచుకుంటూ వారికి కేటాయించిన పని ప్రాంతానికి చేరుకుంటారు. ఫుట్‌పాత్‌పైనే కాసేపు కునుకుతీస్తారు. పెద్దసారు రాగానే హాజరువేసుకుని పనిలోకి దిగుతారు. చీపురు చేతబట్టి రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతారు. కంపుకొడుతున్న చెత్తను తెల్లవారేసరికి ఆటల్లో, ఇతర వాహనాల్లో డంపింగ్‌యార్డుకు తరలించి సుందరనగరంగా మారుస్తున్నారు. ఆరుపదుల వయస్సులో కూడా కష్టమైన పనిని ఇష్టంగా చేస్తున్న పారిశుధ్య కార్మికులు వీళ్లు.. కూకట్ పల్లి, మూసాపేట్ సర్కిళ్ల పరిధిలో 1544 మంది కార్మికులు […]
నగరం నిద్రపోతున్న వేళ వారు మేల్కొంటారు. అర్ధరాత్రి ఆటోలో, లేకుంటే నడుచుకుంటూ వారికి కేటాయించిన పని ప్రాంతానికి చేరుకుంటారు. ఫుట్‌పాత్‌పైనే కాసేపు కునుకుతీస్తారు. పెద్దసారు రాగానే హాజరువేసుకుని పనిలోకి దిగుతారు. చీపురు చేతబట్టి రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతారు. కంపుకొడుతున్న చెత్తను తెల్లవారేసరికి ఆటల్లో, ఇతర వాహనాల్లో డంపింగ్‌యార్డుకు తరలించి సుందరనగరంగా మారుస్తున్నారు. ఆరుపదుల వయస్సులో కూడా కష్టమైన పనిని ఇష్టంగా చేస్తున్న పారిశుధ్య కార్మికులు వీళ్లు.. కూకట్ పల్లి, మూసాపేట్ సర్కిళ్ల పరిధిలో 1544 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో కొందరిని అనారోగ్య సమస్యలు వెంటాడుతుండగా, మరికొందరు ఏళ్లతరబడి సెలవుల్లో ఉంటున్నారు.
దిశ, కూకట్ పల్లి: కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్‌పల్లి, బాలానగర్, ఓల్డ్ బోయిన్‌పల్లి, వివేకానందనగర్, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో మొత్తం 742 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అందులో విధులకు హాజరు కాని వాళ్లు 20 మంది, మరో 21 మంది కార్మికులు మృతిచెందారు. దీంతో కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 702 మంది విధులకు హాజరవుతున్నారు. మూసాపేట్ సర్కిల్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ, బాలాజీనగర్, మూసాపేట్, ఫతేనగర్, అల్లాపూర్ డివిజన్ల పరిధిలో మొత్తం 895 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తుండగా అందులో 25 మంది దీర్ఘకాలికంగా హాజరు కావడం లేదు. మరో 28 మంది మృతి చెందారు. దీంతో 842 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇందులో కొంత మందిని కార్యాలయంలో అటెండర్లుగా విధుల్లో చేర్చుకున్నారు.
కూకట్ పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్ల పరిధిలో కూకట్ పల్లిలో 2,72,865, మూసాపేట్ లో 2,45,211 మొత్తం రెండు సర్కిళ్లలో 5,18,076 మంది జనాభాకు కేవలం 1544 మంది మాత్రమే పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఇందులో ప్రతీ డివిజన్ లో కనీసం 21 మంది ఉంటే అందులో సగం మంది 40 ఏళ్లపైబడి వయస్సు గల వారు ఉండడం గమనార్హం.
కొత్త వారిని తీసుకోవాలని డిమాండ్..
కూకట్ పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్ల పరిధిలో వయస్సు పైబడి పనిచేయలేని పరిస్థితిలో ఉన్న వారు, మృతిచెందినవారు, ఏళ్లతరబడి విధులకు హాజరుకాని వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. లేకుంటే కార్మికుల కుటుంబ సభ్యులను చేర్చకుంటే పని చేసే వారిపై అదనపు భారం పడకుండా ఉంటుందని ఔట్ సోర్సింగ్ కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
24ఏళ్ల నుంచి పని చేస్తున్నా..
24 ఏండ్ల నుంచి కూకట్ పల్లి సర్కిల్ పరిధిలో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విదులకు హాజరవుతున్నా.
-ముత్తమ్మ, పారిశుధ్య కార్మికురాలు
రూ.1,250కి డ్యూటీలో చేరా..
24ఏళ్ల క్రితం రూ.1250 జీతానికి విధుల్లో చేరిన. ఎన్నిరోజులు ఆరోగ్యం సహకరిస్తే అన్ని రోజులు విధులకు హాజరవుతా.
-పార్వతి, పారిశుధ్య కార్మికురాలు
కొందరిని తొలగించాం..
కూకట్ పల్లి డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 21 మందిలో 6 గురు చాలా రోజుల నుంచి విధులకు హాజరు కావడంలేదు. అలాంటి వారిని విధుల నుంచి తొలగించాం. ప్రస్తుతం 15 మంది విధులకు హాజరవుతున్నారు. అందులో 40 ఏండ్లు పైబడిన వారు చాలా మంది ఉన్నారు.
-యాకయ్య, ఎస్ఎఫ్ఏ, కూకట్ పల్లి సర్కిల్
కొత్త వారిని తీసుకోవాలి..
వయస్సు పైబడిన వారు, చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను లేదా కొత్త వారిని తీసుకోవాలి. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి కొత్త వారిని తీసుకుంటే ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై అధిక భారం పడకుండా ఉంటుంది.
-వీరారెడ్డి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకుడు
కొత్త వారిని తీసుకోవడం లేదు..
రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రైవేట్ కంపెనీలకు అప్ప చెబుతుండడంతో కొన్ని ప్రాంతాలలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులను అక్కడి నుంచి ఖాళీలు ఉన్న ప్రాంతాలకు బదిలీ చేసే ఆలోచన ఉంది. కొత్తగా కార్మికులను ఎవరిని నియమించండం లేదు.
–చంద్రశేఖర్ రెడ్డి, వైద్య అధికారి