సిజేరియన్ వెనుక పెద్ద రహస్యం: గర్భిణి

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో సిజేరియన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు దండుకుంటూనే ఉన్నారు. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశమున్నా కాసుల కక్కుర్తి‌తో ఆపరేషన్లు చేస్తున్నారు. నార్మల్ డెలివరీ అయిన వారు సుమారు 3 నుంచి 4 రోజుల్లో కోలుకుంటే సిజేరియన్ అయిన వారు మాత్రం సుమారు 7 నుంచి 8 రోజుల్లో కోలుకుంటారు. అప్పటికీ వారికి పెయిన్స్ తగ్గవు. వీటన్నిటిని లెక్కచేయకుండా కేవలం డబ్బులు కోసం ఆశపడి ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన […]

Update: 2020-08-27 20:31 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో సిజేరియన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు దండుకుంటూనే ఉన్నారు. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశమున్నా కాసుల కక్కుర్తి‌తో ఆపరేషన్లు చేస్తున్నారు. నార్మల్ డెలివరీ అయిన వారు సుమారు 3 నుంచి 4 రోజుల్లో కోలుకుంటే సిజేరియన్ అయిన వారు మాత్రం సుమారు 7 నుంచి 8 రోజుల్లో కోలుకుంటారు. అప్పటికీ వారికి పెయిన్స్ తగ్గవు. వీటన్నిటిని లెక్కచేయకుండా కేవలం డబ్బులు కోసం ఆశపడి ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన వారిలో ఒకరిద్దరికి మినహా దాదాపు అందరికీ సిజేరియన్ చేస్తున్నారు అక్కడి వైద్యులు. కరోనా సాకుతో ప్రస్తుతం డబ్బుల దోపిడీ మరింత పెరిగింది.

ఎంతో ఆశగా ప్రసవాల కోసం ఆస్పత్రులకు వెళ్లే తల్లులకు కడుపుకోత తప్పడం లేదు. సాధారణ కాన్పులకు అవకాశం ఉన్నా కేవలం కాసుల కోసమే సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇలాంటి ఆపరేషన్లు చేయడం వల్ల చాలా మంది స్త్రీలు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కాన్పుల విషయంలో ఆస్పత్రులకు వచ్చే వారి బలహీనతలను, భయాన్ని ఆసరగా చేసుకున్ని వారిని మరింత భయాందోళనకు గురిచేస్తూ సిజేరియన్ చేస్తున్నారు. వైద్యుల సలహా పాటించకుంటే ఏం ప్రమాదం పొంచి ఉందోనన్న భయం బాధిత కుటుంబ సభ్యులు వాటికి అడ్డుచెప్పడం లేదు. సిజేరియన్ సమయంలో ఇచ్చే మత్తు మందు మున్ముందు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

కాన్పు అంటే కోతే..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్‌ కాన్పులు రోజరోజుకూ పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రికి కాన్పు కోసం వెళితే సిజేరియనే అనేలా తీరు మారింది. అనివార్య కారణాలున్నప్పుడు మాత్రమే సిజేరియన్‌ చేయాలని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. సుఖ ప్రసవానికి కడుపులో శిశువు ఉన్న విధానం ప్రతికూలంగా ఉన్నప్పుడు, శిశువు బయటకు రావడానికి మాయ, కణతులు అడ్డుగా ఉండటం వంటి బలమైన కారణాలుంటేనే సిజేరియన్‌ చేయించాలి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2019ఏప్రిల్‌ నుంచి 2020 జూన్ 29వరకు 18,088 మంది గర్భిణులు వివిధ ఆస్పత్రుల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ప్రభుత్వాస్పత్రిలో కాస్త మెరుగు..

ప్రభుత్వాస్పత్రుల్లో కొంత మేర సాధారణ డెలివరీలు చేస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో నెలలో 800కుపైగా కాన్పులు చేశారు. వీటిలో అధికశాతం సాధారణ ప్రసవాలే కావడం విశేషం. కానీ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం దాదాపు 80శాతానికి పైగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు.

కరోనా సాకుతో మరింత దోపిడీ

కరోనా కారణంగా చాలా వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు ఆపరేషన్లు నిలిపివేశారు. దీన్ని అదునుగా చేసుకున్న మరికొంత మంది వైద్యులు మాత్రం మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తాత్కాలికంగా వైద్యులు ఎక్కువ శాతం కొవిడ్ డ్యూటీలో ఉండడంతో అక్కడ వైద్య సేవలకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే వైద్యులు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల కూడా పీహెచ్‌సీ‌ల్లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అండడంలేదు. ఈ సందర్భంలో చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారి ఆదాయం మరింత పెంచుకునేందుకు కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు సాధారణ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన దాని కన్నా ఎక్కువగా మొత్తంలో డబ్బులు గుంజుతున్నాయి.

ఫిర్యాదులపై నో రెస్పాన్స్

ఈ దందాపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా వారు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సిజేరియన్‌ కాన్పులతో ఆస్పత్రి యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. కాన్పు కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్న పేదులు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాన్పు చేసేందుకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు అవుతోంది. జిల్లాలో ప్రైవేట్‌లో చేసిన సుమారు 5,953 ప్రసవాలకు ఒక్క కేసుకు సుమారు రూ.30వేలు లెక్కించినా.. ప్రైవేటు ఆస్పత్రులు రూ.178కోట్టు దండుకున్నారనే చెప్పాలి.

Tags:    

Similar News